టాలీవుడ్‌ విజయాలతో కూడా ఏపీకి సంబందం లేదా?

Tollywood-Jaganతెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పుట్టినిల్లువంటిది. కనుక అది ఆస్కార్ స్థాయికి ఎదిగినా, ఒకేసారి 11 జాతీయ అవార్డులు సాధించినా అది రాష్ట్రానికే ఎంతో గర్వకారణం. అయితే ఆ సంతోషం, క్రెడిట్ కూడా దూరం చేసుకొంది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమను కూడా తమ రాజకీయ ప్రత్యర్ధిగా భావిస్తూ, ముప్పతిప్పలు పెడుతూనే ఉంది.

ADVERTISEMENT

చివరికి చిరంజీవి అంతటివాడి చేతులు జోడించి ప్రార్ధించినా కనికరించలేదు పైగా ఆయన చేతులు జోడించి సిఎం జగన్మోహన్ రెడ్డిని వేడుకొంటున్న ఫోటోలను మీడియాకు విడుదల చేసి అవమానించింది కూడా. ప్రజలకు సినిమాలు చూపించి రంజింపజేసే తెలుగు సినీ పరిశ్రమకే వైసీపీ ప్రభుత్వం సినిమా చూపిస్తోందంటే అతిశయోక్తి లేదు.

మంత్రి రోజా, పోసాని కృష్ణ మురళి, రాంగోపాల్ వర్మ వంటి సినీ పరిశ్రమకు చెందినవారి చేత కూడా కత్తులు దూయిస్తూనే ఉంది. అందుకే సిఎం జగన్‌ స్వయంగా ఆహ్వానించినా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే, వైసీపీ ప్రభుత్వ ధోరణి చూసి, ఏపీలో సినిమాలు ఆడించుకోవడం చాలా కష్టమవుతుందనే ఆలోచనతో కొంతమంది దర్శక నిర్మాతలు తెలంగాణ నేపధ్యంలో సినిమాలు తీయడం ప్రారంభించారు! వాటిని తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు ఆదరిస్తుండటంతో దర్శక నిర్మాతలు వాటికే మొగ్గు చూపుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో వస్తున్న ఈ మార్పుని చూసి ఏపీ ప్రజలు సంతోషించాలా… బాధపడాలా?

మరో విషాదం ఏమిటంటే, వైసీపీ ప్రభుత్వం విపరీత ధోరణి వలన తెలుగు సినీ పరిశ్రమ సాధిస్తున్న ఈ విజయాలు, వాటితో లభించే ఖ్యాతి కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి దూరమైపోయాయి. ఆర్ఆర్ఆర్‌ సినిమా ఆస్కార్ అవార్డు సాధించినప్పుడు, ఇప్పుడు మరో 6 జాతీయ అవార్డులు సాధించినా, మరో 5 తెలుగు సినిమాలకు జాతీయస్థాయి అవార్డులు లభించినా వాటి గురించి ఏపీ ప్రభుత్వం ఎందుకు గొప్పగా చెప్పుకోలేకపోతోంది?అనే ప్రశ్నకు ఈ వేధింపులే కారణమని అందరికీ తెలుసు.

రాష్ట్రం నుంచి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోవడానికి, లేదా రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోవడానికి మేము కారణం కాదంటారు వైసీపీ నేతలు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి, అమరావతిని పాడుబెట్టడానికి టిడిపి నిర్ణయాలే కారణమని వాదిస్తుంటారు.

కానీ తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి దూరమవుతుండటానికి, దాని విజయాలలో ఏపీ ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధం లేకుండాపోవడానికి కారణం ఎవరు?

ADVERTISEMENT
Latest Stories