చిత్రం: టాక్సిక్
M9 రేటింగ్: 1.75/5
విడుదల తేదీ: ఆగస్ట్ 26, 2026
తారాగణం: యష్, నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి తదితరులు
నిర్మాణ సంస్థ: కేవీఎన్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: గీతు మోహన్ దాస్
సంగీతం: రవి బస్రూర్
నిర్మాత: వెంకట్ కే.నారాయణ – యష్
ఛాయాగ్రహణం: రాజీవ్ రవి
కూర్పు: ఉజ్వల్ కులకర్ణి
కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తో విశేషమైన పాన్ ఇండియా పాపులారిటీ సంపాదించుకున్న యష్ నాలుగేళ్ళ విరామం అనంతరం “టాక్సిక్”తో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ చిత్రాన్ని గీతు మోహన్ దాస్ అనే మలయాళ యాక్టర్ టర్నడ్ డైరెక్టర్ తెరకెక్కించగా.. యష్ ఈ సినిమాకి సహ రచయితగా, నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మరి కేజీఎఫ్ ఫీవర్ నుండి యష్ బయటపడ్డాడా? ఆ స్థాయి సినిమాని ఆడియన్స్ కు అందించగలిగాడా? అనేది చూద్దాం..!!
కథ:
1947 తర్వాత బ్రిటిష్ నుండి ఇండియాకి విముక్తి వచ్చినా.. గోవా మాత్రం పోర్చుగీస్ ఆధీనంలోనే ఉంది. ఓపియం డీల్స్ బ్రేక్ అవ్వడంతో డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు లోకల్ గాంగ్స్. ఆ గ్యాంగ్స్ అన్నిటినీ లీడ్ చేస్తుంటాడు రాయా (యష్).
మందు, మగువ, హింస తప్ప ఇంకేం తెలియని రాయా జీవితంలోకి ఎంటరవుతుంది నాడియా (కియారా అద్వానీ). అప్పటివరకు క్రౌర్యంతో, శౌర్యంతో రాజకోట నిర్మించుకుంటూ వస్తున్న రాయా హింసాత్మక రాచరికానికి అతడి వీర్యావేశం అడ్డు పడుతుంది.
అక్కడి నుండి రాయా పయనం ఎటువైపు వెళ్లింది? రాయా కోపానికి ఎందరు బలవ్వాల్సి వచ్చింది? అనేది “టాక్సిక్” కథాంశం.
నటీనటుల పనితీరు:
యష్ స్టైలిష్ గా కనిపించాడు, అతడి స్క్రీన్ ప్రెజన్స్ & స్టైలింగ్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ.. నటుడిగా మాత్రం ఇంకా కేజీఎఫ్ హ్యాంగోవర్ లోనే ఇరుక్కుపోయాడు అని స్పష్టంగా కనిపిస్తోంది. అర్జెంటుగా యష్ గనక ఆ కేజీఎఫ్ ఫీవర్ నుండి బయటపడకపోతే అతడికి హీరోగా కెరీర్ ఉండదు. ఆఖరికి డైలాగ్స్ కూడా రాఖీభాయ్ చెప్పినట్లుగానే ఉన్నాయి తప్ప రాయా అనే పాత్రలో ఏమాత్రం వేరియేషన్ చూపించలేకపోయాడు యష్.
నయనతార సినిమాలో ఉందంటే ఉంది కానీ.. ఎందుకుందో తెలియదు. ఆమె స్టైలింగ్ అస్సలు బాలేదు. కెప్టెన్ అమెరికాలో పెగ్గీ క్యారెక్టర్ తో పోల్చిన మేకప్ & మేకోవర్ అస్సలు సెట్ అవ్వలేదు. అందువల్ల లేడీ సూపర్ స్టార్ లా కనిపించాల్సిన హీరోయిన్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా మిగిలిపోయింది.
కియారా అద్వానీకి మంచి పాత్ర దొరికింది, ఆమె పాత్రలో చాలా వేరియేషన్స్ & ఎమోషన్స్ కూడా ఉన్నాయి. కానీ.. ఆ క్యారెక్టర్ కి ఒక ఆర్క్ కానీ, ఒక బ్యాక్ స్టోరీ కానీ లేకపోవడంతో ఆ పాత్రతో కనెక్ట్ అవ్వలేం. అయితే.. ఆమె హాట్ నెస్ మాత్రం వేరే లెవల్లో ఉంది.
సుదేవ్ నాయర్, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్ వంటి పాపులర్ ఆర్టిస్టులందరూ.. కేవలం బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుల్లా నిల్చుండిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు:
రీసెంట్ గా బ్లాస్ట్ సినిమాకి రవి బస్రూర్ ఇచ్చిన బీజీఎం ఎంత ప్లస్ అయ్యిందో.. ఇప్పుడు అదే రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ టాక్సిక్ సినిమాకి అంత మైనస్ అయ్యింది. అసలే సినిమాలో ఎమోషన్ కానీ ఎలివేషన్ కానీ వర్కవుట్ అవ్వడం లేదంటే.. రవి బస్రూర్ తన మ్యూజిక్ తో ప్రేక్షకుల్ని ఇంకా చిరాకు పెట్టాడు. లింకిన్ పార్క్ అనే పాత హాలీవుడ్ బ్యాండ్ పాపులర్ సాంగ్స్ లో బీజీఎం ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టడం, అది కూడా ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తున్న సినిమాకి పెట్టడం అనేది హాస్యాస్పదం.
సినిమా మొత్తానికి పాజిటివ్ ఏదైనా ఉందంటే.. అది రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ వర్క్. ప్రతి ఫ్రేమ్ లోనూ ఖర్చు కనిపిస్తోంది. ఫ్రేమింగ్స్ లో ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. సీజీ వర్క్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ క్వాలిటీ అదిరిపోయింది. సీజీ వర్క్ మాత్రం ఇంటర్నేషనల్ సినిమాలకి ఏమాత్రం తగ్గని స్థాయిలో ఉంది.
194 నిమిషాల సినిమాని కట్ చేయడానికి ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి ఎంత కష్టపడ్డాడో తెలియదు కానీ.. మూడు గంటల 15 నిమిషాలపాటు ఆ సినిమాని చూడ్డానికి మాత్రం ఆడియన్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే.. ఎడిట్ ఫార్మాట్ & ట్రాన్సిషన్స్ విషయంలో తీసుకున్న కేర్ మాత్రం ప్రశంసార్హం.
దర్శకురాలు గీతు మోహన్ దాస్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామాలో ఎమోషన్ & సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ని ఇరికించడానికి విశ్వప్రయత్నం చేసింది. మేకింగ్ స్టైలిష్ గా ఉన్నా.. కథ-కథనంలో దమ్ము లేక చతికిలపడింది. అసలు కథలోనే దమ్ము లేదనుకుంటే.. కథనం ఇంకా దారుణంగా అల్లింది. “ఎలివేషన్-యాక్షన్ సీన్-రొమాన్స్-తాగుడు సీన్-యాక్షన్-సెంటిమెంట్ డైలాగ్” సినిమా మొత్తం ఇలానే సాగుతుంది. ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. పోనీ రాసుకున్న సైకలాజికల్ పాయింట్ అయినా ఒరిజినలా అంటే కాదు.. ఆల్రెడీ చాలా సినిమాల్లో, ముఖ్యంగా “వన్ నేనొక్కడినే”లో చూసేసాం. యష్ లాంటి స్టార్ హీరో, అది కూడా కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత చాన్స్ ఇస్తే ఇంత దారుణంగా వేస్ట్ చేసుకోవడం అనేది గీతు మోహన్ దాస్ కి మాత్రమే చెల్లింది. ఒక్క క్యారెక్టర్ కి కూడా సరైన ఎస్టాబ్లిష్మెంట్ & ఆర్క్ లేకుండా 30కి పైగా పాపులర్ ఆర్టిస్టులతో సినిమా తీసిన ఘనత కూడా గీతూ మోహన్ దాస్ కే చెల్లుతుంది.
విశ్లేషణ:
అంచనాలన్నిటినీ తలకిందలు చేసి.. సినిమా దారుణంగా బోల్తా కొట్టింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన, ఇంతకుమించి విశ్లేషించాల్సిన అవసరం లేదు కానీ.. టాక్సిక్ తెలుగు డబ్బింగ్ రైటర్ గురించి మాత్రం కచ్చితంగా మాట్లాడుకోవాలి. అసలు వాడుక భాషలో లేని తెలుగు పదాలని ఏరుకొచ్చి మరీ సినిమాలో వాడిన విధానాన్ని ఎప్పటికీ మర్చిపోలేం.
ప్రామాణికం అనే పదాన్ని ఈనాడు సంస్థ కూడా వాడడం దాదాపుగా తగ్గించేసింది, అలాంటి పదాన్ని ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ లో వాడడం, క్రౌర్యం, శౌర్యం, వీర్యం అంటూ పనికిమాలిన యాసలో రాసిన డైలాగ్ అయితే అస్సలు మర్చిపోలేం. ఇవన్నీ సరిపోవన్నట్లు కొన్ని డైలాగ్స్ ను ఏదో గూగుల్ ట్రాన్సలేట్ చేసినట్లుగా డైరెక్ట్ మీనింగ్ ప్లేస్ చేయడం అనేది హాస్యాస్పదం. తెలుగు డైలాగ్ రైటర్ రాధాకృష్ణ భట్టర్ పనితనం గురించి ఎంత మాట్లాడుకున్నా సరిపోదు, అంతలా ఇరిటేట్ చేశాడు.
యష్ నాలుగేళ్ళ కష్టానికి కానీ, వెంకట్ కే నారాయణ 300 కోట్ల బడ్జెట్ కి కానీ ఏమాత్రం న్యాయం చేయలేక.. ప్రేక్షకుల సహనాన్ని విపరీతంగా పరీక్షించిన చిత్రంగా “టాక్సిక్” ఎప్పటికీ నిలిచిపోతుంది.
ఓవరాల్ గా.. యస్ ఆయనొక్కడే!
M9 రేటింగ్: 1.75/5





