అధికార పార్టీ ఎమ్మెల్యే గా రేవంత్ సర్కార్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన వ్యాఖ్యలతో, రాజకీయ ప్రకటనలతో లేనిపోని వివాదాలను సృష్టించుకుని చివరికి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. సురేఖ మొదటి నుంచి కూడా కాంట్రవర్సీ ప్రకటనలు చేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు.
దానికి తోడు తాజాగా కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ అండ్ ఫ్యామిలీ టార్గెట్ గా చేసిన అవినీతి ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో కొండా సురేఖ నుంచి వచ్చిన స్పందన అటు పార్టీ అధిష్టానాన్ని సైతం ఒప్పించలేకపోయింది.
ఫలితంగా చేతిలో ఉన్న మంత్రి పదవి చేజారిపోయింది. అయితే ఇదంతా రేవంత్ రెడ్డి తెరవెనుక చేస్తున్న రాజకీయంలో భాగమే అంటూ కొండా ఫ్యామిలీ రేవంత్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక ఇటు కొండా సురేఖ కు కొంతమంది బిఆర్ఎస్ శ్రేణుల నుంచి మద్దతు కూడా లభించింది.
దీనితో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ కారెక్కుతారా.? అన్న చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో గతంలో మంత్రిగా ఉంటూ కొండా సురేఖ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు తెరమీదకొచ్చాయి.
టాలీవుడ్ కి సంబంధించిన ఒక స్టార్ హీరోహిన్ జీవితంతో ముడిపెట్టి కొండా సురేఖ కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసారు. అయితే ఒక మహిళా మంత్రిగా ఉంటూ కొండా సురేఖ చేసిన ఆ వ్యాఖ్యల పట్ల టాలీవుడ్ లో ఒక ప్రముఖ కుటుబం ఆమె మీద పరువు నష్టం దావా వేయడంతో పాటుగా కేటీఆర్ కూడా సురేఖ టార్గెట్ గా న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు.
అలాగే ఇటు టాలీవుడ్ ప్రముఖులు సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను అమానవీయం అంటూ ముక్తకంఠంతో ఖండించడంతో సురేఖ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఇలా సురేఖ కేటీఆర్ మధ్య సాగిన ఆ వివాదానికి నేడు సురేఖ తన సోషల్ మీడియా పోస్ట్ తో ముగింపు పలకపోతున్నారా.? వై.? అనే ప్రశ్నలు జవాబు కోసం కొండా కుటుంబం వైపు చూస్తున్నాయి.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గతంలో తానూ చేసిన వ్యక్తిగత కామెంట్స్ పై చింతిస్తున్నానని, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే అటువంటి విమర్శలు చెయ్యాల్సి వచ్చిందని, అయితే ఆ నిరాధారమైన ఆరోపణలు నాడు చెయ్యకుండా ఉండి ఉండాల్సిందని, కేటీఆర్ ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ బాధపెట్టాలన్నది తన ఉద్దేశం కాదని, ఇప్పుడా కామెంట్స్ ని ఉపసంహరించుకున్నట్లు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు కొండా సురేఖ.
అయితే సంఘటన జరిగిన ఇన్ని రోజుల తరువాత ఒకరకంగా చెప్పాలంటే సంవత్సరాల తరువాత కొండా సురేఖ సడెన్ గా కేటీఆర్ పై ఈ రకమైన సానుభూతి చూపించడం, తానూ చేసిన వ్యాఖ్యల పట్ల పచ్చాత్తాపం పడడం వెనుక ఉన్న పొలిటికల్ అజెండా జెండా మార్చడమేనా.?
మంత్రి పదవి నుంచి తనను తొలగించిన కాంగ్రెస్ తో విడాకులు తీసుకుని కొండా కుటుంబం గులాబీ కారెక్కడానికి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందా.? కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బాటలోనే కొండా కుటుంబం కూడా పయనించబోతుందా.?
రేవంత్ టార్గెట్ గా రాజకీయం మొదలుపెట్టడానికి కేటీఆర్ తో పొలిటికల్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారా.? అందులో భాగమే ఈ పోస్టా.? ఇలా ఒక్క పోస్ట్ వెనుక అనేక ప్రశ్నలు. అయితే అతి త్వరలోనే వాటికీ సమాధానం కూడా దొరికే అవకాశం కనిపిస్తుంది.
ఏదిఏమైనా రాజకీయాలలోకి వ్యక్తిగత అంశాలను లాగి ప్రత్యర్థిని రాజకీయ దెబ్బ కొట్టడానికి మరేవారినో బలిపీఠం ఎక్కించడం, ఆయా కుటుంబ సభ్యులను మానసికంగా బాధించడం ముమ్మాటికీ ఆమోదయోగ్యం కాదు. నాడు సురేఖ కు రాజకీయ ప్రత్యర్థిగా కనిపించిన కేటీఆర్ ఇప్పుడు సురేఖ దృష్టిలో ఆ స్థానంలో లేరు.
కానీ నాడు ఆయన పతనం కోసం మీడియాకెక్కించిన కొన్ని జీవితాలను, వారి కుటుంబంలో కలిగిన అలజడులకు, మానసిక వేదనలకు, వారి పై పడ్డ విమర్శనా రాళ్లకు సురేఖ ఏమిచ్చి సర్దిచెప్పుకోగలరు.?





