ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఈ యుద్ధం మరో 4-5 వారాలు సాగవచ్చని ట్రంప్ చెప్తున్నప్పటికీ, ఇరాన్ దూకుడు, ప్రతిదాడులు చూస్తుంటే మరో 2-3 నెలలు సాగినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.
ఉక్రెయిన్ వెనుక అమెరికాతో సహా యూరోపియన్ దేశాలున్నాయి కనుక నాలుగేళ్ళుగా పోరాడగలుగుతోంది. కానీ ఇరాన్ వెనుక ఎవరూ లేరు కదా? కనుక ట్రంప్ చెప్పినట్లు మహా అయితే మరో 4-5 వారాలు పోరాడగలదు. ఆ తర్వాత చేతులేత్తెయక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నిజమే ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోవచ్చు. కానీ ఏదో రోజు అమెరికా కూడా ఈ యుద్ధానికి మూల్యం చెల్లించాల్సి రావచ్చు. అది ఎప్పుడు ఏవిధంగా అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఈ యుద్ధమే ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నిటినీ ఏకం చేసే అవకాశం ఉంది గనుక!
అమెరికా తమ కళ్ళని తమ వేళ్ళతోనే పొడుచుకునేలా చేస్తూ తమని వాడుకుంటోందని గ్రహించలేనంత అమాయకులు కారు గల్ఫ్ దేశాధినేతలు.
అమెరికా ఇలా దండయాత్రలు చేస్తూ, ఒక్కొక్క దేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంటుంటే ఎవరూ చూడరనుకోవడం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగుతున్నట్లే కదా?
ఆఫ్ఘనిస్తాన్ కోసం మా అమెరికన్ల కష్టార్జితం (పన్ను సొమ్ము), అమెరికన్ సైనికుల ప్రాణాలు బలివ్వాల్సిన అవసరం లేదని ఆ దేశం నుంచి అమెరికా దళాలను వెనక్కు తెచ్చేసింది ట్రంప్ దొరగారే.
ఇప్పుడు ఆయనే ఇరాన్‌తో యుద్ధం చేయడం కోసం అమెరికన్ల కష్టార్జితాన్ని, అమెరికన్ సైనికుల ప్రాణాలు పణంగా పెడుతున్నారు.. అంటే ట్రంప్ ఆలోచనలోనే పెద్ద లోపం ఉందా?అంటే కాదనే చెప్పాలి.
ఎందుకంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో ఎంత ఖర్చు చేసినా, ఎన్ని ప్రాణాలు బలిపెట్టినా అమెరికాకు పైసా ప్రయోజనం లేదు. కనుక అక్కడ యుద్ధం వద్దనుకున్నారు. కానీ ఇరాన్‌లో చమురు నిక్షేపాలున్నాయి. కనుక యుద్ధం చేస్తున్నారు. ఇది ట్రంప్ ద్వంద వైఖరికి చక్కటి నిదర్శనం.
కానీ ఈ యుద్ధం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ కాలం కొనసాగి అమెరికా ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తిన్నా, అమెరికన్ సైనికుల శవపేటికలు ఇంకా పెరిగినా ట్రంప్ పట్ల దేశ ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది.
ట్రంప్ దురహంకారంతో ఇప్పటికే అనేక మిత్ర దేశాలను దూరం చేసుకున్నారు. గల్ఫ్ దేశాలలో అమెరికాకు కొత్త శత్రువులు సృష్టించి అమెరికా భద్రతకు ముప్పు కొనితెచ్చుకుంటున్నారు.
అయితే ఆయన రేపు పదవీకాలం పూర్తయితే చేతులు దులుపుకొని దిగి వెళ్ళిపోతారు. కానీ ఆయన చేసిన ఈ నిర్వాకాల వలన అమెరికాకు ఎప్పటికీ ప్రమాదం పొంచే ఉంటుంది. కనుక అమెరికాని పులి మీద సవారీ చేయిస్తున్నట్లే లెక్క.
కానీ కర్రున్నవాడిదే బర్రె అన్నట్లు ఇప్పుడు ట్రంప్ చేతిలో ఆ కర్రుంది. కనుక ఆయన దిగిపోయే వరకు ఆయన ఆడిందే ఆట పాడిందే పాట! ఎవరూ ఆయనని ఆపలేరు! ఆయన సంగతి తెలిసీ అయన చేతికి కర్ర అందించిన పాపానికి ఆయన కొట్టే ఇలాంటి దెబ్బలు భరించాల్సిందే… తప్పదు!




