‘సినిమా చూపిస్తా మావా…’ కేవలం సినిమా టైటిల్ మాత్రమే కాదు… దాన్ని మనం చాలా రకాలుగా వాడేసుకుంటాము. ఇంతకాలం ఇది మన తెలుగు వాళ్ళకు మాత్రమే సొంతమనుకున్నాము.
కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా దీనిని విరివిగా వాడేసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, తాజాగా విదేశీ సినిమాలపై కూడా 100 శాతం సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించేశారు. ట్రంప్ ఏదో మాట వరసకి ఈ మాట అనలేదు. ‘ట్రూత్’ చెప్పారు.
ఇంతకాలం అమెరికన్ల ఉద్యోగాలు, వ్యాపారాలను ప్రపంచ దేశాలు దొంగిలిస్తున్నాయంటూ ఎడాపెడా ఆంక్షలు, సుంకాలు విధిస్తున్న ట్రంప్, తాజాగా అమెరికా చిత్ర పరిశ్రమని విదేశాలు దోచుకుంటున్నాయని ఒక్క ముక్కలో చెప్పేశారు.
ఇది చిన్న పిల్లాడి చేతిలో చాక్లెట్ ఎత్తుకుపోవడం వంటిదేనని కనుక అమెరికన్ చిత్ర పరిశ్రమని కాపాడుకోవడం కోసం, అమెరికా బయట తీసే సినిమాలపై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇది భారతీయ సినీ పరిశ్రమపై ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకి సడన్ బ్రేకులు వేసినట్లే అవుతుంది. తెలుగుతో సహా దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదుగుతున్నాయి.
ఇక్కడ భారత్‌లో సినిమా విజయాలను రూపాయిలలో కొలిస్తే, అక్కడ అమెరికాలో 7-8 రెట్లు అధిక విలువ గల డాలర్లలో ఉంటుంది. అమెరికాలో లక్షల మంది భారతీయులు… వారి సినీ అభిమానం మన సినీ పరిశ్రమకు ఆయువుపట్టు వంటిది.
ఇప్పుడు ట్రంప్ వాళ్ళకీ, మన సినీ పరిశ్రమకి మాట మాత్రంగానైనా చెప్పకుండా ‘సినిమా చూపిస్తా మావా’ అంటూ టికెట్ చించేశారు.
ఈ ప్రభావం ముందుగా త్వరలో విడుదల కాబోయే అన్ని పెద్ద సినిమాలపై చాలా తీవ్రంగా ఉంటుంది. ట్రంప్ దెబ్బకు చిన్న సినిమాలు ఇకపై కలలో కూడా అమెరికాలో విడుదల గురించి ఆలోచించలేవు.
ఇప్పటికే ఓటీటీల వలన హాలీవుడ్‌తో సహా యావత్ ప్రపంచ సినీ పరిశ్రమకి చాలా నష్టం జరుగుతోంది. ఇప్పుడు ట్రంప్ కొట్టిన ఈ దెబ్బ నుంచిఎవరూ తప్పించుకోలేరు. దీనికి ప్రత్యామ్నాయాలు కూడా ఉండవు కనుక భారతీయ సినీ పరిశ్రమకు లక్షల కోట్ల డాలర్ల నష్టం తప్పదు.
విదేశీ సినిమాలపై 100 శాతం సుంకాలు విధించినంత మాత్రాన్న అమెరికన్ చిత్ర పరిశ్రమ వందల కొద్దీ సినిమాలు తీసి ఈ లోటును భర్తీ చేయగలదా?అంటే కాదనే చెప్పవచ్చు. కనుక ట్రంప్ కొట్టిన ఈ దెబ్బకి భారతీయ సినీ పరిశ్రమ మాత్రమే కాదు… అమెరికాలో భారతీయ సినిమాలు ప్రదర్శిస్తున్న వందల కొద్ది థియేటర్లు కూడా చాలా తీవ్రంగా నష్టపోతాయి. చివరికి మూతపడినా ఆశ్చర్యం లేదు. మరి ట్రంప్ ఎవరికి మేలు చేస్తున్నట్లు?





