అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఎందుకు యుద్ధం మొదలుపెట్టారు? దాని వలన నష్టపోతున్నా ఎందుకు ఆపడం లేదు?అంటే పైకి కనిపించే చెప్పుకునే కారణాలు చాలానే ఉన్నాయి. అవి అందరికీ తెలుసు.
కానీ పశ్చిమాసియా వ్యవహారాలలో మంచి అనుభవం ఉన్న భారతీయ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ మరింత లోతుగా విశ్లేషించారు.
అయన విశ్లేషణ ప్రకారం… నిజానికి ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టాలనుకోలేదు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాటలు నమ్మి యుద్ధం మొదలుపెట్టారు.
ఇరాన్, లెబనాన్ తదితర దేశాల వలన ఇజ్రాయెల్‌కు ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని గట్టిగా నమ్ముతున్న నెతన్యాహు, ట్రంప్‌ని ఎగదోశారు.
ఇరాన్ అణ్వాయుధాలు తయారుచేసే దశకు చేరుకుందని చెప్పారు. అమెరికాని పాలించిన మాజీ అధ్యక్షులకు కూడా నెతన్యాహు ఇదే చెప్పేవారు. కానీ ఎవరూ నమ్మలేదు. కానీ ట్రంప్‌ని సులువుగా నమ్మించారు.
అయితే ఈ ఒక్క కారణంతోనే ట్రంప్ తన దారికి రారనే సంగతి నెతన్యాహుకు బాగా తెలుసు. కనుక ఇరాన్‌ని చాలా సులువుగా ఓడించవచ్చని, ఓడిస్తే అక్కడున్న అపారమైన సంపద సొంతం చేసుకోవచ్చని ట్రంప్‌ని నమ్మించారు.
ట్రంప్ అనుకున్నట్లు జరుగకపోతే ఎంతకైనా తెగిస్తారనే విషయం నెతన్యాహుకు బాగా తెలుసు. కనుక ట్రంప్‌కి ఈ దురాశ పుట్టించి అయన బలహీనతతో నెతన్యాహు ఆడుకున్నారు.
ఆవిధంగా ‘వీకెండ్ పిక్నిక్’ అంటూ మొదలుపెట్టిన యుద్ధంలో తొలిరోజే ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖోమైనీని హతం చేయడంతో ట్రంప్‌లో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది.
కానీ నాలుగు నెలలైనా యుద్ధం ముగించలేకపోవడంతో ఆయనలో అసహనం మొదలైంది. ఇరాన్‌ని లొంగదీసుకోలేకపోవడం, ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడటంతో, ట్రంప్ అటు ప్రపంచ దేశాలకు, ఇటు అమెరికన్లకు జవాబు చెప్పుకోలేక తలదించుకోవలసి వస్తోంది.
ఇరాక్‌తో 8 ఏళ్ళపాటు ఏకధాటిగా యుద్ధం చేసిన ఇరాన్‌ని తాను చాలా తక్కువ అంచనా వేశాననే విషయం ట్రంప్‌కి అర్థమైంది.
తన ఈ పరిస్థితి కారణం నెతన్యాహు అని ట్రంప్ చాలా ఆలస్యంగా గ్రహించారు. అందుకే ఇప్పుడు తరచూ ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ విషయంలో నెతన్యాహు అంచనా నేటికీ తప్పలేదు.
అనుకున్నట్లు జరుగకపోవడంతో ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరిస్తారనే నెతన్యాహుకు తెలుసు. ట్రంప్ కూడా ఆయన ఊహించినట్లే వ్యవహరిస్తున్నారు.
ఏదోవిధంగా ఇరాన్‌ని లొంగదీసుకుంటేనే తను కోల్పోయిన గౌరవం, ప్రతిష్ట తిరిగి పొందగలనని ట్రంప్ భావిస్తున్నట్లున్నారు. అందుకే మళ్ళీ యుద్ధం మొదలుపెట్టారు.
మళ్ళీ యుద్ధం మొదలవడంలో ఇరాన్ తప్పు కూడా ఉంది. కానీ ఆ తప్పుని సమర్ధించుకోవడానికి దానికి బలమైన కారణముంది.
తమ దేశాధ్యక్షుడిని కుటుంబ సమేతంగా మట్టుబెట్టి, తమ దేశంపై దాడులు చేస్తూ తమ సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్నప్పుడు ఇరాన్ చేతులు ముడుచుకొని కూర్చోదు కదా? ప్రపంచ దేశాల ఒత్తిడి వలన శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకాలు చేసినప్పటికీ దాని పగ, ప్రతీకారం ఎన్నటికీ పోవు.
ట్రంప్, నెతన్యాహు, ఇరాన్ ఎవరి కారణాలు వారికున్నాయి కనుక అమెరికా-ఇరాన్ మద్య యుద్ధంలో కామాలే తప్ప ఫుల్ స్టాప్ ఉండకపోవచ్చు.




