విజయవాడ వేదికగా వెలుగు చూసిన కల్తీ మద్యం కేసులో ఏ-9 నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ముందస్తు బెయిల్ కోసం విజయవాడ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అంతే కాదు, జనవరి 6వ తేదీ లోపు విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
సోమవారం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా… సిట్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు, విష్ణును అరెస్ట్ చేయబోమని, విచారణ నిమిత్తం ఆయనకు నోటీసులు మాత్రమే జారీ చేస్తామని, దీనికి విష్ణు సహకరించాలని కోరారు. దీంతో విష్ణు దాఖలు చేసుకున్న పిటిషన్ కు అర్ధం లేదని కోర్టు కొట్టివేసింది. అలాగే విచారణ కమిటీకి మల్లాది విష్ణు పూర్తిగా సహకరించాలని సూచనలు చేసింది.
అయితే, ముందుగా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరినప్పటికీ, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారని విష్ణు వర్గం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి కేసు మొదలైన తొలినాళ్ళల్లో మీడియా ముందుకు ధైర్యంగా వచ్చి సమాధానం చెప్పిన విష్ణు, ఈ కారణంగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా స్థానిక వర్గాల సమాచారం. అయితే, కోర్టు ఏకంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఏర్పడిన ‘ట్విస్ట్’తో మల్లాది విష్ణు ఏం చేస్తారో చూడాలి. కోర్టు ఆదేశాలను అనుసరించి విచారణ నిమిత్తం లొంగిపోతారా? లేక హైకోర్టును ఆశ్రయిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.





