‘ప్రత్యేక హోదా’కు అడ్డు… తమిళనాడు, బీహార్, కర్ణాటక..!

Union aviation Minister Ashok Gajapathi Raju on Andhra Pradesh Special Statusరాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లు నానాటికి పెరిగిపోతున్నాయి. మొన్నటివరకు విపక్షాల నుంచే ఈ తరహా డిమాండ్లు వినిపించగా, తాజాగా కేంద్ర మంత్రులు ఇచ్చిన వరుస ప్రకటనలతో అధికార పార్టీ టీడీపీ సైతం గొంతెత్తక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు… అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదన్న విషయాన్ని వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

దేశంలోని మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదని సొంతూరు విజయనగరంలో వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, బీహార్ ముఖ్యమంత్రులు జయలలిత, సిద్దరామయ్య, నితీశ్ కుమార్ ల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావట్లేదని, కేవలం ఈ ముగ్గురి వల్లే ఏపీకి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చి ఉంటే, ఎంతమంది అడ్డుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని అభిప్రాయపడ్డారు.

మోడీ సర్కారు ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటోందని, ఏపీకి న్యాయం చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు సాక్షిగా భరోసా ఇచ్చారన్నారు. ఈ విషయంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నారని వెల్లడించారు గజపతిరాజు.

ADVERTISEMENT
Latest Stories