‘మెగా’ వృక్షం క్రింద ఎంట్రీ ఇచ్చే హీరోల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇందులో నిజంగా ప్రేక్షకులను ఆకట్టుకునే వాళ్ళెంత మందో గానీ, ‘మెగా’ అన్న పేరు ఒక్కోసారి సినీ ప్రేక్షకుల పాలిట శాపంలా మారుతోందన్నది విమర్శకుల మాట. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను మినహేయిస్తే మిగతా హీరోలనంతా బలవంతంగా ప్రేక్షకులపై ప్రయోగిస్తున్నారని గత నాలుగైదు ఏళ్ళుగా వెల్లువెత్తిన విమర్శలు. ఈ జాబితాలో నుండి ఇటీవలే అల్లు అర్జున్ కాస్త మినహాయింపు పొందగా, ‘కంచె’ సినిమాతో వరుణ్ తేజ్ విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. అయినా ఇంకా నిరుపించుకోవాల్సింది చాలా ఉంది.
ఇక, మిగతా వారంతా ‘వారసత్వం’ పేర్లతో ‘పబ్బం’ గడుపుకుంటున్నారని ట్రేడ్ వర్గాలో బహిరంగ విమర్శలే వినపడుతుంటాయి. ఇంకా తమకు లేని ‘టాలెంట్’ కోసం ప్రయత్నిస్తూ… సినిమాలకు వచ్చిన ప్రేక్షల పాలిట ‘హీరో’ కంటే ‘విలన్’ అవతారం చూపిస్తున్నారనేది మరో విమర్శ. ఆయా హీరోలు నటించిన కొన్ని సినిమాల్లోని వారి వారి అభినయాలను గమనిస్తే… ఈ విమర్శలలో అర్ధం లేకపోలేదన్న భావన సామాన్య ప్రేక్షకుల నుండి కూడా వ్యక్తమవుతోంది.
తాజాగా సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ ‘మెగా’ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం యాక్టింగ్, డాన్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. చిరు, పవన్ ల మాదిరి వెండితెరపై నిరూపించుకుంటే పర్వాలేదు గానీ.., సినిమాకు వచ్చిన అభిమాన ప్రేక్షకులతో ఓ ఆట ఆడుకుంటే మాత్రం మరో “మెగా” హీరోను జనాల పై రుద్దడమేనన్నఅభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.
బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే ‘సినీ పరిశ్రమ’ అని ఇప్పటికే ‘టాలీవుడ్’పై ఓ మచ్చ ఉంది. జరుగుతున్న ఈ పరిణామాలు దీనికి మరింత ఆజ్యం పోసేయిలా కనపడుతున్నాయి. అయినా ఇలా సినీ కుటుంబాలకు చెందిన వారే హీరోలుగా అవతరిస్తుంటే… ఇటీవల సినిమాల్లో పేలుతున్న ఓ “జోకు” గుర్తు రాక మానదు. అదేనండి… “ఖాళీగా ఉన్నాడని సినిమా హీరోను చేసేస్తే పోలా..!”





