తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు.
ఫ్యూచర్ ఎల్ఎల్పీ చైర్మన్, యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ గత ఏడాది తన కంపెనీలోని మెజారిటీ వాటాను విక్రయించగా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని శ్రీవారికి బంగారు ఆభరణాల రూపంలో సమర్పించాలని నిర్ణయించుకున్నారు.
శ్రీవారికి శిరస్సుపై అలంకరించే కిరీటం మొదలు పాదాల వరకు అలంకరించేందుకు శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, అభయహస్తాలు, వడ్డాణం, భుజకీర్తులు, పాదుకలు, వజ్రాలు పొదిగిన హారాలు సహా దాదాపు 45 నుంచి 47 రకాల ఆభరణాలను 9 సెట్లుగా రూపొందించారు.
టీటీడీ అధికారులు, అర్చకులు, ఆగమ శాస్త్ర నిపుణుల సూచనల మేరకు చెన్నైలోని ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ ద్వారా అత్యంత నైపుణ్యంతో వీటిని తయారు చేయించారు. వీటి విలువ సుమారు రూ.206 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
వర్ధమాన్ జైన్ కుటుంబ సభ్యులు గురువారం ఉదయం రంగనాయకుల మండపం నుంచి ఊరేగింపుగా ఆనంద నిలయానికి చేరుకుని అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను అభినందించారు. శుక్రవారం ఉదయం నిర్వహించే అభిషేక సేవ అనంతరం శ్రీవారిని ఈ నూతన స్వర్ణాభరణాలతో అలంకరించనున్నారు. టీటీడీ చరిత్రలో ఒక భక్తుడు ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు కానుకగా అందించడం ఇదే తొలిసారి.





