ఒక ఫిలిం మేకర్ కి తాను తీసిన సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. వందమంది వంద రకాల ఫీడ్ బ్యాక్ లు ఇస్తూ ఉంటారు, అందులో పనికొచ్చేది మాత్రమే తీసుకొని, మిగతా వాటిని పక్కన పెట్టేస్తూ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఒక ఫిలిం మేకర్ పని. అయితే.. ఇదంతా రిలీజ్ కి ముందు వరకు. ఒక్కసారిన్ సినిమా రిలీజై, జనాలు దాన్ని రిజెక్ట్ చేసారు అంటే వెంటనే నిజం గ్రహించి, తప్పు ఒప్పుకొని, తన భవిష్యత్ సినిమాల మీద దృష్టిసారించాలి. అంతే కానీ.. ఆడియన్స్ రిజెక్ట్ చేసిన సినిమాని ఇంకా పట్టుకుని వ్రేలాడుతూ.. నేనేదో గొప్ప సినిమా చేశాననే భ్రమలో బ్రతకకూడదు.
కానీ.. దర్శకుడు విఘ్నేష్ శివన్ మాత్రం ఇంకా భ్రమలోనే ఉంటున్నాడు. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ” అనే సినిమా గత నెల విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకోలేక థియేటర్లను వీడి.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కి వచ్చేసింది. అక్కడ కూడా జనాలు ఆ సినిమాని అంతగా మెచ్చుకున్న దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే.. ఇదేం సినిమారా బాబు అని తిట్టిపోసిన సందర్భాలే ఎక్కువ. అలాంటిది విఘ్నేష్ శివన్ మాత్రం తాను తీసిన “LIK” సినిమాకి విపరీతమైన అప్రిసియేషన్ వస్తుందని, కేవలం తాను డబ్బులు ఇవ్వలేదని చాలామంది నెగిటివిటీ చేశారని, ఎప్పటికైనా తన సినిమా హిట్టేనని ఓ పెద్ద పోస్ట్ పెట్టాడు.
దాంతో.. నెటిజన్లు మరోసారి విఘ్నేష్ శివన్ ను తప్పు పట్టడం మొదలెట్టారు. ఏదో క్లాసిక్ సినిమా తీసినట్లు ఎందుకిలా పట్టుకుని వేలాడుతున్నావ్, ఇంకో సినిమా తీసి హిట్ చేసి నీ టాలెంట్ నిరూపించుకో అని హితబోధ చేస్తున్నారు. అయినా.. ప్రదీప్ రంగనాథన్ కి ఫస్ట్ ఫ్లాప్ ఇచ్చానని కూడా రియలైజ్ అవ్వకుండా, ఇంకా ఏదో మాస్టర్ పీస్ తీసినోడిలా బిల్డప్ ఇవ్వడం అనేది హాస్యాస్పదమే. మరి విఘ్నేష్ ఈ భ్రమ నుండి ఎప్పుడు బయటపడతాడో, నయనతారైనా కాస్త విఘ్నేశ్ ను రియాలిటీలోకి తీసుకురావాలి.




