జన నాయకుడిని బిజేపియే ప్రమోట్ చేసిందిగా!

Vijay’s Jana Nayagan Cleared by Madras High Court

కోలీవుడ్‌ హీరో విజయ్ తాజా చిత్రం జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో రిలీజ్ కాలేదు. ఈ సినిమాకి తక్షణమే యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డుని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో తమిళనాడులో విజయ్ అభిమానులు, తమిళగ వెట్రి కజగం (టివికే) కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

విజయ్ చివరి సినిమా ఇది. తర్వాత సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసి ఇక పూర్తిగా తమిళనాడు రాజకీయాలలో పాల్గొనబోతున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం అధికార డీఎంకె పార్టీకి నష్టం కలిగిస్తుంది. కనుక ఆయనకు అవరోధాలు సృష్టించవచ్చు. గత ఏడాది సెప్టెంబర్‌ కరూర్‌లో విజయ్ రాజకీయ ర్యాలీ నిర్వహించగా దానిలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. కనుక స్టాలిన్ ప్రభుత్వం ఆ కేసుతో విజయ్‌ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ADVERTISEMENT

జనాకర్షణ లేని అన్నాడీఎంకే నేతల కంటే విజయ్‌ వంటి పాపులర్ నటుడుతో కలిసి ముందుకు సాగితే తమిళనాడులో నిలద్రొక్కుకోవచ్చని బిజేపి అధిష్టానం భావించి ఉండవచ్చు. కనుక ఆ క్లిష్ట పరిస్థితిలో తమిళనాడు బిజేపి విజయ్‌కి మద్దతు పలికింది. ఒకవేళ ఆయన బిజేపితో పొత్తుకి విజయ్‌ అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం ఆ కేసు నుంచి చాలా తేలికగా ఆయనని బయట పడేయగలదు.

కానీ ఆయన కూడా ద్రవిడ విధానంతో ముందుకు సాగితేనే తన లక్ష్యం చేరుకోగలనని భావించారు. కనుక బిజేపితో పొత్తుకు అంగీకరించలేదు.

కనుక టీవీకె పార్టీతో విజయ్‌ ఎంట్రీ వలన బిజేపి-అన్నాడీఎంకే కూటమి ఎన్నికలలో గెలుపు మరింత కష్టంగా మారుతుంది. కనుక ఇప్పుడు బిజేపి కూడా ఆయనని శత్రువుగా పరిగణిస్తోంది.

బహుశః అందువల్లే సెన్సార్ బోర్డుపై రాజకీయ ఒత్తిళ్ళు చేసి ‘జన నాయకుడు’ విడుదల కాకుండా అడ్డుపడిందని ఆయన అభిమానులు, కోలీవుడ్‌లో అందరూ భావిస్తున్నారు. విజయ్‌కి సంఘీభావం తెలిపారు.

ఇదే సమయంలో మద్రాస్ హైకోర్టు ‘జన నాయకుడు’కి వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డుని ఆదేశించింది. కనుక రేపో మాపో ‘జన నాయగన్’ థియేటర్లలోకి విజయ్‌ ప్రజలలోకి వచ్చేయడం ఖాయమే.

కనుక ఒకవేళ బిజేపి సెన్సార్ బోర్డుపై రాజకీయ ఒత్తిళ్ళు చేసి ఉండి ఉంటే ‘వ్రతం చెడినా ఫలం దక్కలేదన్నట్లయింది’ దాని పరిస్థితి.

‘జన నాయకుడు’కి బ్రేకులు వేసి లొంగదీసుకోవాలని అనుకుంటే సినీ హీరో విజయ్‌ని తమిళనాడు ప్రజలలో ‘జన నాయగన్’గా ప్రమోట్ చేసినట్లయింది.

ఈ కారణంగా సినిమా నిలిచిపోవడంతో తమిళనాడులో విజయ్‌ పట్ల సానుభూతి ఏర్పడింది. దానిని అయన తెలివిగా ఉపయోగించుకోకుండా ఉండరు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమిళనాడుపై బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం చేస్తోందని అధికార, ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. కనుక ఇప్పుడు విజయ్‌ కూడా తన సినిమాకి కేంద్ర ప్రభుత్వమే అడ్డు పడిందని గట్టిగా చెప్పుకోవడం మొదలుపెడితే, తమిళనాడులో బిజేపికి, దానితో పొత్తు పెట్టుకునందుకు అన్నాడీఎంకే పార్టీ రెండూ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories