TVK కి JSP ఒక కేసు స్టడీ.?

Vijay Political Entry Sparks Comparisons With Pawan Kalyan

సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ అనేది సర్వ సాధారణమైన పదం. ఇక్కడి సినిమాలు అక్కడి భాషతో అక్కడి సినిమాలు ఇక్కడి భాషతో అనువాదం అవుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈ డబ్బింగ్ సినిమాలు ట్రెండ్ నడుస్తుంటది.

అయితే ఇప్పుడు ఈ డబ్బింగ్ ట్రెండ్ సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి కూడా పాకుతుందా అన్నట్టుగా ఉంది. తెలంగాణలో పుట్టి ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీకి తమినాడు విజయ్ దళపతి ‘తమిళగ వెట్టిరి కజగం’ అనువాద పార్టీ మాదిరి కనిపిస్తుంది.

ADVERTISEMENT

గతంలో రాజకీయ పరంగా జనసేన ఎటువంటి ఎదురుదెబ్బలు తిన్నదో TMK కి అదే జరుగుతుంది, అలాగే గతంలో జనసేన అధినేతగా పవన్ పై ఏ విమర్శలు విరుచుకుపడ్డాయో ఇప్పుడు విజయ్ పై కూడా అదే తరహా విమర్శలు దాడి జరుగుతుంది.

2014 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో జన్మ తీసుకున్న జనసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నడక నేర్చుకుంది. 2014 ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుని టీడీపీ, బీజేపీ పొత్తుకు మద్దతు తెలిపిన JSP అటు పిమ్మట 2019 లో టీడీపీ ని కాదని బీజేపీ తో తెగతెంపులు చేసుకుని ఒంటరి పోరుకి సిద్దమయ్యి ఘోర ఓటమిని, అవమానాలను ఎదుర్కొంది.

అయితే నాటి పవన్ పతనం వెనుక బీజేపీ హస్తం కూడా ఉందని, బీజేపీ, వైసీపీ కి పరోక్ష మద్దతు ఇవ్వడంతో టీడీపీ ఓటమితో పాటు JSP పతనం కూడా ఖరారయ్యింది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టి ప్రచారమే నడిచింది. ఇక పవన్ కి కూడా తత్త్వం భోదపడి ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ తో పొత్తు కుదుర్చుకోవాల్సి వచ్చిందని కూడా పుకారు నడిచాయి.

అలాగే ఇన్నాళ్ళుగా సినీ రంగంలో పవర్ స్టార్ గా ఉండి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగి చిరు తమ్ముడు నుంచి తన సొంత గుర్తింపు, గౌరవంతో కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. కానీ ఒక్కసారి పొలిటికల్ ఎంట్రీ తో నాడు పవన్ వెనుక కూడా మాట్లాడలేని కమీడియన్స్ నుంచి కారెక్టర్ ఆర్టిస్ట్ వరకు పవన్ ముందుకొచ్చి విమర్శలు గుప్పించారు.

ఆయన పెళ్లిళ్లకు వంటి వ్యక్తిగత విషయాలు మొదలు తల్లి, చెల్లి అనే తేడా కూడా లేకుండా ఆయన కుటుంబం పై జరిపిన మానసిక దాడి వరకు అన్నిటిని పవన్ ఒంటరిగా, మౌనంగా మోయాల్సి వచ్చింది. ఇక వృత్తి పరంగాను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చిత్రాలకు ఎదురయినా ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు చిత్ర నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.

పవన్ సినిమా రిలీజ్ అంటే చాలు ఏపీలో టిక్కెట్ రేట్ల తగ్గింపు అమాంతం అమలులోకి వచ్చేది, అలాగే క్షేత్ర స్థాయిలో వాటి అమలు ఎలా నడుస్తుంది అనేదానికి థియేటర్ల వద్ద ప్రభుత్వ అధికారుల రిక్కీ నడిచేది. 2019 లో జనసేన తీసుకున్న ఒక్క నిర్ణయం జనసేన ను ఓడించింది, పవన్ ను అవమానించింది, పవన్ సినిమాలను నష్టపరిచింది, రాష్ట్ర భవిష్యత్ ని నాశనం చేసింది.

ఇక ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ తో కూడా సరిగ్గా విజయ్ కు ఇవే అవమానాలు, ఆయన సినిమా రిలీజ్ లకు అవే కష్టాలు. అయితే వీటి వెనుక కూడా బీజేపీ రాజకీయం మిళితమయ్యింది అనేది తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

అలాగే ఆయన వ్యక్తిగత జీవితం పై కూడా అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. హీరోహిన్ త్రిష తో కలిపి విజయ్ పై వ్యక్తిగత దాడి మొదలు పెట్టింది బీజేపీ. త్రిష కు విజయ్ కి మధ్య ఎదో సంబంధం ఉందని,ముందు తన కుటుంబ సమస్యలు చక్కబెట్టుకుని ఆ తరువాత రాష్ట్రం గురించి ఆలోచిస్తే మంచిదంటూ తమిళ బీజేపీ నేత నాగేంద్రన్ వ్యాఖ్యానించారు.

అలాగే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్ల లోకి రావాల్సిన విజయ్ ఆఖరి చిత్రం జననాయకన్ ఇప్పటికి రిలీజ్ కి నోచుకోలేదు, అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.

ఇక కరూర్ తొక్కిసలాట ఘటన కేసుల రూపంలో విజయ్ ని వెంటాడుతుంది, ఈ ఘటన ఇటు పొలిటికల్ గాను అటు వ్యక్తిగతంగానూ విజయ్ కెరీర్ కి ఒక బ్యాక్ డ్రాప్ గా నిలుస్తుంది. ఆ ఒక్క సంఘటన అడ్డుపెట్టుని ఇటు రాష్ట్ర రాజకీయ పార్టీలు అటు కేంద్ర పార్టీలు ఎవరికీ వారు వారి రాజకీయం చేస్తున్నారు.

ఒకరు విజయ్ కి మద్దతుగా ఉంటే మరొకరు విజయ్ ని దోషిగా చిత్రీకరిస్తున్నారు. అయితే విజయ్ మాత్రం నేను ఎటువంటి రాజకీయ బెదిరింపులకు, రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు తలవొగ్గను, ఒంటిగానే పోటీ చేస్తా, విజయం సాధిస్తా అంటూ ప్రస్తుతానికి ఒంటిరి పోరుకే సై అంటున్నారు.

మరి ఆ ఒత్తిడులు, వేధింపులు, విమర్శలు ఇంకా ఎన్నాళ్లపాటు విజయ్ ఒంటరిగా ఎదుర్కుంటారు, మౌనంగా భరిస్తారు.? పవన్ మాదిరి రాజీ పడతారా.? లేదా రాయిలా దృఢంగా ఉంటారా.? అనేది కాలమే సమాధానం చెపుతుంది.

ADVERTISEMENT
Latest Stories