ఈ డొంక తిరుగుడు దేనికి… చెప్పేయొచ్చుగా?

vijayasai-reddy-ysrcp-return

రాజకీయాలలోకి ఎవరైనా రావచ్చు. అలాగే వదిలి వెళ్ళిపోవచ్చుకూడా. ఇదేమి క్రికెట్ రిటైర్‌మెంట్ కాదు కనుక రాజకీయాలలోకి మళ్ళీ రావచ్చు కూడా. విజయసాయి రెడ్డి కూడా అలాగే వెళ్ళిపోయారు. తిరిగివస్తున్నానని ప్రకటించారు. మంచిదే.

అయితే అయన మళ్ళీ వైసీపీలో చేరాలనుకుంటే, జగన్‌ అందుకు ఒప్పుకుంటే నిరభ్యంతరంగా చేరొచ్చు. ఇద్దరికీ ఎవరి షరతులు వారికి ఉంటాయి. అందుకోసం వైసీపీలో సర్దుబాట్లు చేయాలంటే సజ్జల వంటి పలువురు మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

ADVERTISEMENT

కనుక ఇది కేవలం జగన్‌- విజయసాయి వ్యవహారం మాత్రమే కాదు. కనుక విజయసాయి బాధితులు అప్రమయ్యే ఉంటారు. బహుశః ఇప్పటికే వైసీపీ చుట్టూ బ్యారికేడ్లు కట్టేస్తున్నా ఆశ్చర్యం లేదు.

విజయసాయి తాజా ట్వీట్‌లో ఆంధ్రాలో ఆడపిల్లల వరుస హత్యలు, అన్ని నియోజకవర్గాలలో చెలరేగిపోతున్న గంజాయి బ్యాచ్‌లు అంటూ మొదలుపెట్టి ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. కానీ అక్కడితో ఆపలేదు.

ఈ సమస్యలపై పోరాడటంలో వైసీపీ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యిందన్నట్లు పేర్కొన్నారు. వైసీపీలో కొందరు నాయకులు, అధికార టీడీపితో కుమ్మక్కు అయ్యి విచారణ జరుగకుండా అడ్డుకుంటున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఇలాంటి అంశాలపై ఎవరైనా ప్రభుత్వాన్ని, పోలీసులను నిందిస్తుంటారు. కానీ విజయసాయి రెడ్డి వైసీపీని కూడా నిందిస్తున్నారు. అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కోటరీ నేతలు శల్య సారధ్యం చేస్తున్నందున, ఆయనకు సరైన మార్గదర్శకుడు లేకపోవడం వల్లనే పార్టీ అస్తవ్యస్తంగా మారిందని విజయసాయి రెడ్డి చెపుతున్నట్లుంది.

కానీ వైసీపీలో చేరాలనుకుంటే నేరుగా జగన్‌తో ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ మాట్లాడేసుకుంటే బాగుండేది. ఒకవేళ అలాంటి ఉద్దేశ్యం లేకుంటే సొంత కుంపటి అని చెప్పుకోవచ్చు. లేదా బిజేపిలో చేరిపోతున్నానని చెప్పుకోవచ్చు.

కానీ రాష్ట్రంలో ఆడపిల్లలకి భద్రత లేదు.. గంజాయి బ్యాచ్ అరాచకాలంటూ ఈ డొంక తిరుగుడు దేనికి?

ADVERTISEMENT
Latest Stories