పొట్టి క్రికెట్ అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారు… వీలు చిక్కినపుడు ఓ బౌండరీ, లేదంతో ఒక సిక్స్… కానీ, నేడు డివిలియర్స్, కోహ్లి చేసిందేమిటి అంటే… వీలు చిక్కినపుడు ఒక డాట్ బాల్, లేదంటే సింగిల్ పరుగు. అవును… బ్యాటింగ్ విధ్వంసానికి మారుపేరుగా డివిలియర్స్ – కోహ్లి జోడి మిగులుతోంది. తొలి 10 ఓవర్లలో కేవలం 76 పరుగులు చేసి నెమ్మదిగా బ్యాటింగ్ చేసేలా కనపడ్డ బ్యాటింగ్ ధ్వయం, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.
ముఖ్యంగా డివిలియర్స్ కొట్టిన షాట్లు… బహుశా క్రికెట్ చరిత్రలో మరొకరు కొట్టలేరేమో అనే విధంగా వీర ఊతుకుడు ఉతికాడు. అవాక్కయ్యే సిక్సర్లకు తోడు స్పిన్నర్ ప్రవీణ్ మాంబే ఓవర్లో ఆఫ్ సైడ్ ఆడిన షాట్ కు కామెంటేటర్లు, బౌలర్ మాంబే, మరో ఎండ్ లో ఉన్న కోహ్లి బిత్తరపోయి చూడడం… నిజంగా డివిలియర్స్ ప్రతిభకు తార్కాణంగా చెప్పాలి. అలాగే మరుసటి ఓవర్లో ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ వేసిన ఫుల్ టాస్ బంతిని తనదైన స్టైల్లో మోకాలిపై కూర్చుని, వెనుకవైపున ఉన్న రూఫ్ పై పడేలా చేసి… ప్రేక్షకులను సమ్మోహితులను చేసాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో బాల్… ఒక్కో షాట్ గురించి చెప్పాల్సి ఉంటుంది. 15 ఓవర్లకు 136 పరుగులున్న స్కోర్ ను 5 ఓవర్లలో 248 పరుగులకు చేర్చారంటే ఏ విధంగా బ్యాటింగ్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. 30 బంతుల్లో 112 పరుగులు రాబట్టి మ్యాచ్ ను గుజరాత్ నుండి దూరం చేసారు. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ తప్పక గెలవాల్సిన బెంగుళూరు జట్టు ఈ మ్యాచ్ లో భారీ విజయం అందుకోవడం ‘నల్లేరు మీద నడకే.’ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే మిగిలిన మూడు మ్యాచ్ లలో కూడా విజయాలు సొంతం చేసుకోవాలి.



