క్రికెట్ ప్రపంచంలో సంచలనాలు నమోదు చేసే జట్టుగా పేరుగాంచిన బంగ్లాదేశ్ తాజాగా ఓ చెత్త రికార్డును తన సొంతం చేసుకుంది. బుధవారం నాడు వెస్టీండీస్ తో ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 43 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. మొత్తమ్మీద 18.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన బంగ్లా టీంలో లిటన్ దాస్ (25) మాత్రమే రెండెంకల స్కోర్ ను నమోదు చేసారు.
దాస్ ను మినహాయిస్తే, టాప్ నుండి 4, 1, 0, 0, 0, 4, 1, 0, 6, 2 బాటం వరకు అందరూ సింగిల్ డిజిట్లే! విండీస్ బౌలర్లు ఎక్స్ ట్రాలు కూడా ఏమీ సమర్పించుకోలేదు. రోచ్ 5 ఓవర్లు వేసి 8 పరుగులకు 5 వికెట్లను సొంతం చేసుకోగా, కమ్మిన్స్ 3, హోల్డర్ 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో టెస్ట్ క్రికెట్ లో అత్యంత తక్కువ స్కోర్ ను నమోదు చేసిన రెండవ జట్టుగా బంగ్లాదేశ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు అదే పిచ్ పై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రత్ వైటే 88 పరుగులతో క్రీజులో ఉండగా, పెవిలియన్ కు చేరుకున్న స్మిత్ 58, పొవెల్ 48 పరుగులు చేసారు. ఇప్పటికే 158 పరుగుల ఆధిక్యంలో ఉన్న విండీస్ జట్టు చేతిలో ఇంకా 8 వికెట్లు ఉండడంతో, భారీ ఆధిక్యం ఖాయంగా కనపడుతోంది.



