టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమైనా, సక్రమమైనా, అది జరిగిపోయిన విషయం. రాజకీయంగా టీడీపీని దెబ్బ తీయాలని జగన్ చేసినా, వచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలుగుదేశం ప్రయత్నిస్తున్నా… రాబోయే రెండు, మూడు నెలల్లో జరగనున్న పొలిటికల్ పరిణామాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.
బాబు అరెస్ట్ తో జనసేన ముందుకు వచ్చి పొత్తులను అధికారికం చేసింది. అయితే దీనిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు? ప్రజల చేత ఏ స్థాయిలో ఆమోద ముద్ర వేయించుకుంటారు? అనేది అత్యంత ఆసక్తికరంగా మారనుంది. జనసేనకు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో ఉండడం కలిసొచ్చే అంశం. అయితే టీడీపీకి ఇప్పటివరకు అన్నీ తానై చంద్రబాబు నడిపించారు.
ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే, చంద్రబాబు ఇప్పట్లో విడుదల అవుతారా? లేదా? అన్నది తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు, సామాన్య ప్రజలలోనూ ఒకింత ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ అదే జరిగితే టీడీపీ తరపున నిలబడడానికి లోకేష్, బాలకృష్ణలు సఫలీకృతం అవుతారా? అంటే అది ఒకింత అనుమానాస్పదమే అని చెప్పక తప్పదు.
లోకేష్ కు పాదయాత్ర ద్వారా లభించిన ప్రజాధరణ కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ, పార్టీ బాధ్యతలను మొత్తం తన భుజాల మీద మోసుకుని ముందుకు నడిపే సామర్ధ్యత ఏ స్థాయిలో ఉందన్నది చూడాల్సిన విషయం. అందులోనూ జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో, సీట్ల పంపకాలు – పార్టీ నేతల బుజ్జగింపులు, ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. ఇంత ఒత్తిడిని లోకేష్ తట్టుకోగలుగుతాడా?
ఓ విధంగా ఇవన్నీ ఆలోచనలు చేసే జగన్ రాజకీయంగా తన వ్యూహాన్ని అమలు చేసారా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. నిజంగా చంద్రబాబుని మరో ఆరు మాసాల పాటు విజయవంతంగా జైలులో ఉంచగలిగితే, జగన్ తన ప్రత్యర్థులకు చెక్ పెట్టే రాజకీయాలు చేయబోతున్నారా? అన్నది వేచిచూడాల్సిన విషయం.
చంద్రబాబు అరెస్ట్ అనేది ప్రజలలో పెద్ద ఎత్తున సానుభూతిని సృష్టించిన మాట వాస్తవమే. అయితే దీనిని ప్రజల్లోకి అంత బలంగా చెప్పగలిగే టీడీపీ నాయకుడు కనిపించకపోవడమే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే అంశం. ప్రస్తుతం ఉన్న నేతలందరూ బాబు చాటు నీడలే తప్ప, బాబు స్థాయికి ఏ ఒక్కరూ సరిపోరు. అందులోనూ పదవులు వస్తే అనుభవించేందుకు చూపే ఉత్సాహం, ఆపద వస్తే పోరాటం చేయడంలో టీడీపీ నేతలు చూపకపోవడం పార్టీ కార్యకర్తలను నిరాశకు గురి చేసే అంశం.





