సినిమా తీస్తున్నంత కాలం అందరూ ఆహా ఓహో అంటూనే ఉంటారు. దర్శక నిర్మాతలు, నటీనటులు మరో అడుగు ముందుకు వేసి ఇలాంటి సినిమా ‘నభూతో… నభవిష్యత్’ అని రెండే రెండు ముక్కలో తేల్చి పడేతుంటారు. ఇంటర్వ్యూలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పరస్పరం పొగడ్తలు, గొప్పలు ఆకాశాన్ని అంటుతాయి.
ఇంత ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అవుతుంటే ఏమాత్రం టెన్షన్ పడకూడదు. దర్శకుడు మారుతిలా “సినిమా ఫ్లాప్ అయితే కొండాపూర్‌లో నా ఇంటికి వచ్చి కాలర్ పట్టుకొని నిలదీయండి,” అని ధైర్యంగా చెప్పగలగాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎదురెళ్ళి క్షమాపణలు చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి.
కానీ నెగెటివ్ రిపోర్ట్స్ రాగానే “సినిమా రిజల్ట్ ఒక్క షోతో రాదు కనీసం పది రోజులు అవసరం. నా సినిమాని చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు.
ఆ సీన్స్ లేవని అభిమానులు చిన్నబుచ్చుకున్నారు. కనుక వాటిని జోడిస్తున్నాము. వాటి కోసం కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేసి తీసేశాము. ఇప్పుడు క్లైమాక్స్ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు..”అంటూ సంజాయిషీలు చెప్పుకునే పరిస్థితి రాకూడదు.
‘సినిమా రిజల్ట్ ఒక్క షోతో రాదు కనీసం పది రోజులు అవసరం,’ అని చెప్పుకున్నప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ చూపించి ‘బ్లాక్ బస్టర్’ ‘గ్రాండ్ సక్సస్’ అంటూ సక్సస్ మీట్స్ పెట్టుకొని నవ్వులపాలు కాకూడదు కదా?
సినిమాకి హైప్ సృష్టించడం చాలా అవసరమే. కానీ సినిమా బెడిసి కొడితే అదే బూమరాంగ్ అవుతుందని మరిచిపోకూడదు.
సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజులకో లేదా వారం రోజుల తర్వాత కొత్త సన్నివేశాలు లేదా ఓ పాట జోడించి సినిమా పడిపోకుండా నిలబెట్టుకోవాలని అనుకోవడం అర్థం చేసుకోవచ్చు లేదా ఇదో గొప్ప వ్యాపార టెక్నిక్ అనిపించవచ్చు.
కానీ టికెట్ ఛార్జీలు భారీగా పెంచేసినా తమ హీరో మీద వీరాభిమానంతో మొదటి రోజే జేబులు ఖాళీ చేసేసుకున్న అభిమానుల నుంచి మళ్ళీ డబ్బులు దండుకోవాలనుకోవడం వారిని మోసం చేయడమే అవుతుంది కదా?
ఇది దర్శకుడు మారుతి గురించో లేదా రాజసాబ్ గురించో చెపుతున్న మాట కానే కాదు. మావి పెద్ద సినిమాలు… పాన్ ఇండియా సినిమాలు అని గొప్పలు చెప్పుకునే ప్రతీ ఒక్కరి కోసం!






