చంద్రబాబు నాయుడు తర్వాత సిఎం ఎవరు?

Who Will Be the Next AP Chief Minister After Chandrababu Naidu?

భవిష్యత్‌లో ఏపీ సిఎం పదవికి ఎవరెవరికి అవకాశం ఉంది?అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్‌లలో ఎవరో ఒకరికి. ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాగలిగితే జగన్మోహన్ రెడ్డికి అని ఎవరైనా చెప్పగలరు.

వైసీపీలో ఈ పదవికి మరెవరూ పోటీ పడలేరు కానీ కూటమిలో నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్‌ మద్య పోటీ ఉంది కనుక ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం అంటే.. కొన్ని లెక్కలు కట్టుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

2024 ఎన్నికల ప్రచారంలో తనకు అవకాశం లభిస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అనుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్‌ చాలా స్పష్టంగానే చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు వద్ద నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, కనుక మరో 5-10 ఏళ్ళు ఆయన నేతృత్వంలోనే పనిచేయాలనుకుంటున్నానని పవన్ కళ్యాణ్‌ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన వైఖరిలో ఈ మార్పు ఆకస్మికం ఏమీ కాదు.

పవన్ కళ్యాణ్‌ రాజకీయ ప్రస్తానం మొదటి నుంచి నిశితంగా గమనిస్తే ఆయన ఏనాడూ పదవీ, అధికారం కోసం ఆరాటపడలేదని, అవసరమైతే వెనక్కు తగ్గేందుకు ఏమాత్రం వెనకాడరని అర్ధమవుతుంది. కనుక ఒకవేళ సిఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్‌ అభ్యంతరం చెప్పకపోవచ్చు.

రాహుల్ గాంధీ, కేటీఆర్‌లకు ప్రధాని, ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పుడు వారికి దక్కలేదు. ఇకపై దక్కే అవకాశం ఉంటుందో లేదో తెలీని పరిస్థితి.

కనుక సిఎం చంద్రబాబు నాయుడు తాను రాజకీయాలలో చురుకుగా ఉండగానే నారా లోకేష్‌ని ముఖ్యమంత్రి చేయాలనుకోవడం సహజమే.

నారా లోకేష్‌ కూడా అన్నివిధాల తన సమర్దత నిరూపించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌తో పోలిస్తే నారా లోకేష్‌కు పార్టీ నేతగా, మంత్రిగా అదనపు అనుభవం ఉంది. ఆయనకు బిజేపి సంపూర్ణ మద్దతు ఉంటుందని జమ్మలమడుగు బిజేపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు.

కానీ జనసేన నేతలు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌ సిఎం కావాలని కోరుకుంటున్నారు. కనుక వారు వ్యతిరేకించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్‌ వారికి సర్ది చెప్పి ఒప్పించగలరు.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ముగ్గురి మద్య ఇంత సఖ్యత, గౌరవాభిమానాలను చూసి ఇలా జరుగుతుందని ఊహించుకోనవసరం లేదు.

రెండు పార్టీలు ఐఖ్యతగా కొనసాగితేనే పదవీ, అధికారం మన చేతిలో ఉంటాయని, వాటి కోసం కొట్లాడుకొని విడిపోతే జగన్‌ సిద్ధంగా ఉన్నారని వారు ముగ్గురికీ భాగా తెలుసు.

కనుక ముఖ్యమంత్రి పదవి విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ ముందే మాట్లాడుకొని ఓ ఒప్పందం చేసుకుని ఉండవచ్చు. వారు దానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నందునే వారి మద్య ఇంత సఖ్యత ఉందనుకోవచ్చు.

ఒకవేళ వచ్చే ఎన్నికలకు ముందు లేదా తర్వాత నారా లోకేష్‌ ముఖ్యమంత్రి పదవి చేపడితే, పవన్ కళ్యాణ్‌ పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలగడం సహజమే.

పవన్ కళ్యాణ్‌ సనాతన ధర్మం పేరుతో బిజేపితో కలిసి పని చేయాలనుకున్నట్లు ఇప్పటికే బలమైన సంకేతాలు ఇచ్చారు. ఈ ఏప్రిల్‌-మే నెలల మద్య తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్‌ కీలక పాత్ర పోషించవచ్చు.

అలాగే తెలంగాణలో బిజేపి అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడవచ్చు. ఈ విధంగా బిజేపితో బంధం బలపడి వచ్చే ఎన్నికలలో మళ్ళీ కేంద్రంలో బిజేపి అధికారంలోకి వస్తే, ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్‌ని తన మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఉండరు. అందుకు చంద్రబాబు నాయుడు మద్దతీయడం ఖాయం.

పవన్ కళ్యాణ్‌లో జాతీయస్పూర్తి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన రెండూ ఎక్కువే కనుక అలాంటి అవకాశం లభిస్తే దానికే మొగ్గు చూపవచ్చు.

అప్పుడు ఏపీ సిఎం పదవికి ఈ పోటీ ఉండదు. ఈలోగా ఏపీలో నారా లోకేష్‌ వైసీపీని రప్పా రప్పా ఆడించి గ్రౌండ్ క్లియర్ చేస్తుంటారు.

అయితే నారా లోకేష్‌ కూడా జాతీయ స్థాయిలో తన సత్తా నిరూపించుకోవడం అవసరమే. అప్పుడు పవన్ కళ్యాణ్‌కి సిఎం కుర్చీ అప్పగించి నారా లోకేష్‌ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే వారి ముగ్గురి ప్లాన్ అయ్యుంటే ఇది ‘విన్ అండ్ విన్’ పాలసీ అవుతుంది. అవునో కాదో కాలమే చెపుతుంది.

ADVERTISEMENT
Latest Stories