అమెరికా సంబంధాలా…ఇప్పుడొద్దులే!

US marriage relations

ఒకప్పుడు అమెరికా సంబంధం కుదిరితే అది పూర్వ జన్మ సుకృతమే అన్నట్లుండేది. కానీ ఇప్పుడు ‘అమెరికా సంబందమా… బాబోయ్ మాకొద్దు..’ అని తల్లితండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది.

దీనికి ట్రంప్‌ని నిందించడం కూడా సరికాదు. ఎందుకంటే గతంలో అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకొని సెటిల్ అవడానికి కొన్ని వేల మంది ఉత్తుత్తి పెళ్ళిళ్ళు చేసుకొని వీసాలు పొంది, అక్కడకు చేరుకోగానే డైవోర్స్ తీసుకునేవారు. ఒకానొక సమయంలో ఇది చాలా విచ్చలవిడిగా సాగింది.

ADVERTISEMENT

నిజంగానే పెళ్ళిళ్ళు చేసుకొని భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నవారూ లక్షల మంది ఉన్నారు. వీటన్నిటి వలన అమెరికన్లకు క్రమంగా ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. అమెరికా యువతలో గూడు కట్టుకున్న ఈ అసహనాన్ని ట్రంప్‌ బాగా గుర్తించారు.

కనుక ‘అమెరికా ఫస్ట్’ పేరుతో మొదటి సారి అధ్యక్షుడైనప్పుడే తన మార్క్ పాలన మొదలుపెట్టారు. డిపెండెంట్ వీసాలపై వచ్చినవారు బయట ఉద్యోగాలు, ఇంట్లో వ్యాపారాలు చేసినా వెంటనే ప్యాకప్ చెప్పేసేవారు. అప్పుడే తల్లితండ్రులలో అమెరికా సంబంధాలపై పునరాలోచన మొదలైందని చెప్పవచ్చు.

ఇప్పుడీ పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారింది. ఇటీవల పెళ్ళిళ్ళు చేసుకొని అమెరికా వెళ్ళడానికి సిద్దపడుతున్నా కొత్త దంపతులు కొత్త రకం సమస్యలు ఎదుర్కొంటున్నారు.

వారి పెళ్ళి గురించి అమెరికన్ కౌన్సిలేట్ అధికారులు అడిగే ప్రశ్నలకు వారిద్దరి జవాబులలో ఏ మాత్రం చిన్న తేడా ఉన్నా వీసాలు తిరస్కరిస్తున్నారు. కనుక పెళ్ళి చేసుకున్నా జరిగిందని నిరూపించుకోక తప్పడం లేదు. కనుక దీని కోసం భార్యాభర్తలు ముందుగా ఇంట్లోనే రిహార్సల్స్ కూడా చేయాల్సివస్తోంది.

ట్రంప్‌ సుంకాల పుణ్యమాని ఇప్పుడు భారత్‌లోని ఐటి కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల జీవితాలకే భద్రత లేకుండా పోతోంది. ఎప్పుడు ఎవరిని పీకేస్తారో తెలీని పరిస్థితి. ఇక అమెరికాలో సంగతి చెప్పక్కర లేదు.

అనేక ఏళ్ళగా అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ట్రంప్‌ దెబ్బలకు అందరి ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది.

కనుక ‘అయన దిగిపోయే వరకు అమెరికా సంబంధాలు వద్దులే…” అని అనుకునేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కనుక అమెరికాలో లక్షల రూపాయల జీతాలతో పనిచేస్తున్నప్పటికీ అబ్బాయిలకు, అమ్మాయిలకు కూడా పెళ్ళి సంబంధాలు కుదరడం చాలా కష్టంగా మారుతోంది. అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్న ఇటువంటి కారణాల వలన పెళ్ళిళ్ళు కాకపోతే ఇదొక సామాజిక విషాదమే కదా?

ఇంతకాలం పెళ్ళి చేసుకోవాలని ఆరాటపడిన అమెరికాలో అబ్బాయిలు, అమ్మాయిలు కూడా తమ ఉద్యోగాల విషయంలో అభద్రతాభావం, అనిశ్చితితి నెలకొని ఉండటంతో ఇప్పుడా ఆలోచన మానుకొని, ఉద్యోగం పీకేస్తే ప్రత్యమ్నాయాలు ఏమున్నాయని వెతుకుంటున్నారు.

ట్రంప్‌ వలన కొంత, అమెరికాలోని మన భారతీయులు చేస్తున్న అతివల్ల కావచ్చు అమెరికన్లలో విదేశీయుల పట్ల ద్వేషభావాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికాలో తరచూ భారతీయులపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనం.

కనుక భారత్‌లోని చాలా మంది తల్లి తండ్రులు తమ కొడుకు లేదా కూతుర్లకు బెంగళూరు, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారికే ఇచ్చి చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

ఇటువంటి డైలమాలో ఉండిపోతే ఆ తర్వాత జీవితంలో పెళ్ళే కాక పోవచ్చుననే భయంతో అమెరికాలో ఉద్యోగాలు వదులుకొని స్వదేశానికి తిరిగివస్తున్న వారూ ఉన్నారు. భారత్‌లోనే ఉద్యోగాలు సంపాదించుకొని లేదా సొంతంగా ఐటి కంపెనీలు, వ్యాపారాలు పెట్టుకొని సెటిల్ అవుతున్నారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చి భారత్‌లో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవితంలో సెటిల్ అవుతున్నావారు కోకోల్లలున్నారు. ఇది కూడా ట్రంప్‌ పుణ్యమే!

ADVERTISEMENT
Latest Stories