అందరికీ సంతోషమే కావాలి కానీ…

Why We Choose Stress Over Happiness in Daily Life

అందరికీ సంతోషమే కావాలి కానీ బాధనే ఇష్టపడతారు. మనుషులు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. జీవితాన్ని సుఖమయం చేసుకునేందుకు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. అంత కష్టపడి సంపాదించుకున్న సుఖ సంతోషాలను నిజంగానే అనుభవిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి.

మనుషులు విలాసవంతమైన జీవితానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నారు కానీ రకరకాల సమస్యలు, ఒత్తిళ్లు కారణంగా సంతోషంగా జీవించలేకపోతున్నారు. ఈ రోజుల్లో అన్నీ సాధించిన చాలా మంది సుఖంగా నిద్రపోలేకపోతున్నారు. కడుపు నిండా తినడానికి కూడా భయపడుతున్నారు. ఎందువల్ల?

ADVERTISEMENT

అంటే చేస్తున్న ఈ ఉద్యోగం పోతే ఎలా?ఈ నెల ఈఎంఐకి డబ్బు ఏర్పాటు చేయలేకపోతే ఎలా వంటి సమస్యల మొదలు ఈరోజు కూర రుచిగా లేదు… పిల్లలు అల్లరి చేస్తున్నారనే చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో నుంచి చూస్తుండటం వల్లనే.

ప్రతి మనిషి సుఖంగా, సంతోషంగా మాత్రమే ఉండాలనుకుంటాడు. కానీ కంటెదురుగా ఉన్న చిన్న చిన్న సంతోషాల కంటే బాధనే ఎక్కువ ఇష్టపడుతుంటాడు. అవకాశం ఉన్నప్పటికీ దానిని గుర్తించకుండా, అనుభవించకుండా లేని బాధలు, కష్టాలు ఊహించుకుంటూ జీవిస్తుంటారు.

చాలా మంది గతంలో జరిగినవి లేదా భవిష్యత్తులో జరగబోయే సమస్యల గురించే ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని కోల్పోతున్నారు. ఇలా ఆలోచనల భారంతోనే సంతోషంగా జీవించే అవకాశాన్ని తామే వదులుకుంటున్నారు.

ఏమీ లేనివాడు ఎప్పుడో ఒకప్పుడు కనీసం ఒక క్షణం, ఓ గంట, ఓ రోజైనా సంతోషంగా జీవించగలడు. ఆకలి కడుపుతో కంటి నిండా నిద్రపోగలడు. నిర్వేదానికి గురికాడు. ఎందుకంటే సమస్యలే అతడికి ఆలోచనలకు సమయం ఇవ్వవు.

బాధలు, సమస్యలు, కష్టాలను అధిగమించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండటం వల్ల అతడిలో నిర్వేదం చోటు చేసుకోదు. కానీ అన్నీ ఉన్నవాడు మాత్రం లేని బాధలను ఊహించుకుంటూ సంతోషాన్ని దూరం చేసుకుంటాడు.

జీవిత భాగస్వాములు లేదా తల్లిదండ్రులు, పిల్లల కళ్లలో ఆనందం కూడా సంతోషమేనని చాలామంది గ్రహించరు. అలాంటి సంతోషం కోసం విలాసవంతమైన జీవితం, పెద్ద కారు, వీకెండ్లలో బయట తిరగడం తప్పనిసరి అనుకుంటారు.

కనుక సంతోషం కోసం కారేసుకొని ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. ముందు మన మనసులో, తర్వాత ఇంట్లో సంతోషం నింపుకోగలిగితే చాలు.

ADVERTISEMENT
Latest Stories