కూతురు కోసం విలీనానికి సిద్దపడిన కేసీఆర్‌….

Will KCR Merge BRS with BJP to Save KTR? Key Questions Rise

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితని అరెస్ట్‌ చేసి తీహార్ జైల్లో పెట్టినప్పుడు ఆమె తండ్రి కేసీఆర్‌ ఎంత ఆవేదన అనుభవించి ఉంటారో ఊహించుకోవచ్చు. ఆయన కూతురుని పరామర్శించడానికి వెళ్ళలేదు. కానీ తనను విడిపించేందుకు చేసిన న్యాయపోరాటానికి అయ్యే ఖర్చులు పూర్తిగా ఆయనే భరించారని కవిత స్వయంగా చెప్పారు.

ఇది రాజకీయ కక్షపూరిత కేసు కనుక తనని జైలు నుంచి విడిపించుకునేందుకు, తన తండ్రి కేసీఆర్‌ బీఆర్ఎస్‌ పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు సిద్దపడ్డారని కవిత చెప్పారు.

ADVERTISEMENT

కానీ తాను జైల్లో ఉన్నా చాలా ధైర్యంగానే ఉన్నానని కనుక తన కోసం పార్టీని వదులుకోవద్దని చెప్పానన్నారు. ఎందుకంటే పార్టీపైన లక్షలమంది కార్యకర్తలు ఆధారపడి ఉన్నారని కవిత చెప్పారు.

నాడు ఆమె కోసం బీఆర్ఎస్‌ పార్టీని బీజేపిలో విలీనం చేయడానికి సిద్దపడిన కేసీఆరే కూతురుని పార్టీ నుంచి బయటకు గెంటేశారు. హరీష్ రావు, మరికొందరు చెప్పుడు మాటలు విని తండ్రి తనని పార్టీలో నుంచి బహిష్కరించారని కవిత ఆరోపిస్తున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు ఆ చర్చ అనవసరం.

కూతురు కవితని జైలు నుంచి విడిపించుకోవడానికి పార్టీని బీజేపిలో విలీనం చేయడానికి సిద్దపడిన కేసీఆర్‌, ఒకవేళ ఎఫ్‌-1 రేసింగ్ కేసులో తన రాజకీయ వారసుడు కేటీఆర్‌ జైలుకి వెళితే పార్టీని బీజేపిలో విలీనం చేయకుండా ఉంటారా? అంటే ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి రాబోయే రోజుల్లో సమాధానం లభించవచ్చు.

కానీ బీఆర్ఎస్‌ పార్టీ ఉన్నది ప్రజల కోసమే, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమేనని చెపుతుంటారు. బీఆర్ఎస్‌ పార్టీయే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెపుతుంటారు.

ఇలా చెపుతూ కూతురు లేదా కొడుకుని జైలు నుంచి విడిపించుకోవడానికి పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు కేసీఆర్‌ సిద్ధపడితే, అది గులాబీ కారుని వేరొకరికి అమ్మేసినట్లే అవుతుంది.. కదా?

ఒకవేళ ఈసారి కేసీఆర్‌ అందుకు సిద్దపడితే ముందుగా కేటీఆర్‌, హరీష్ రావుల పరిస్థితి ఏమిటి?ఇంతకాలం బీజేపిపై కత్తులు దూసి, ఇప్పుడు వారి ముందే ఇద్దరూ చేతులు కట్టుకొని నిలబడగలరా?

విలీనం వద్దనుకుంటే హరీష్ రావుకే బీఆర్ఎస్‌ పార్టీ పగ్గాలు అప్పజెప్పేసి కేసీఆర్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? త్వరలోనే ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

ADVERTISEMENT
Latest Stories