దర్శకుడిగా సుకుమార్ ఆలోచనలు తెలుగు సినిమా స్థాయిని మించి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! సుకుమార్ దర్శకత్వం వహించిన గత రెండు సినిమాలు “1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో” సినిమాల కధాకధనలు తెలుగు ప్రేక్షకుల ఆలోచలనకు అందని రీతిలో ఉండడం వల్లనే ఈ సినిమాలకు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వచ్చాయి. “1 నేనొక్కడినే” సినిమా ప్రభావంతో సుకుమార్ సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయని భావించిన అభిమాన ప్రేక్షక వర్గం “నాన్నకు ప్రేమతో“ సినిమాను యావరేజ్ స్థాయికి తీసుకెళ్లాయి.
ప్రస్తుతం “నాన్నకు ప్రేమతో” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సుకుమార్, దీని తర్వాత తన కుటుంబ సభ్యుడ్ని హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ ను హీరోగా మారుస్తూ మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో… మహేష్ “1” ద్వారా ఇచ్చిన అవకాశాన్ని తానూ సరిగా ఉపయోగించుకోలేదని, ఇంకో అవకాశం ఇస్తే, ఈ సారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమాను ఇస్తానని సుకుమార్ చెప్పారు.
మరి ఈ వ్యాఖ్యలు నిజమయ్యాయో ఏమో గానీ, ఇటీవల జరిగిన “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమా ఆడియో వేడుకకు విచ్చేసిన మహేష్ పక్కనే సుకుమార్ దర్శనమిచ్చారు. దీంతో వచ్చే ఏడాది సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం “బ్రహ్మోత్సవం,” ఆ తర్వాత మురుగదాస్ చిత్రంలో నటిస్తున్న ప్రిన్స్, అన్నీ కుదిరితే మలి చిత్రాలుగా రాజమౌళి, సుకుమార్ సినిమాలు ఉంటాయని తెలుస్తోంది.





