వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఆరో తేదీన కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో నాలుగు సార్లు కమిటీ విచారణకు పలు కారణాలతో రోజా గైర్హాజరైంది. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేశారు.
అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసినప్పటికీ రోజా అనారోగ్యం కారణంగా కమిటీ ముందు హాజరు కాలేదు. తనకు మరో 15 రోజుల సమయం కావాలని ఆమె కొద్దిరోజుల ముందు లేఖను పంపారు.
గతంలో ఎన్నిసార్లు పిలిచినా ఆమె కమిటీ పిలుపును లెక్కచేయలేదనీ, కనుక ఆమె విన్నపాన్ని ఈ సారి పరిగణనలోనికి తీసుకోవాల్సిన పనిలేదని తొలుత అభిప్రాయపడిన కమిటీ, చివరకు మరో అవకాశం ఇస్తూ నోటీసులు జారీ చేసారు. దీంతో ఈ సారి హాజరై తన తప్పు లేదని నిరూపించుకునే బాధ్యత రోజా వంతయ్యింది.





