పట్టిసీమ ప్రాజెక్ట్ మొదలు అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చంద్రబాబు పాలనకు, జగన్ ప్రతిపక్షానికి సమీక్ష నిర్వహించారు. అధికార పార్టీ పాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఇదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని తన మాటల చతురతను ప్రదర్శించారు. 2019 ఎన్నికల నాటికి ప్రజలు తమ వైపుకే మొగ్గు చూపుతరన్న నమ్మకంతో ఇద్దరు నాయకులు ఉన్నారని, ఈ ఇద్దరి వల్లనే ఏపీ నష్టపోతోందని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ సందర్భంగా జగన్ కు కాస్త మానసిక స్థ్యెర్యాన్నిఇచ్చే ప్రయత్నం చేసారు. 1983, 85 సమయాల్లో ఉన్న కాంగ్రెస్ కన్నా, 2004లో ఉన్న టీడీపీ కన్నా బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉందని, అధికార పార్టీకి – ప్రతిపక్ష పార్టీకి మధ్య 1.2 శాతం ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయని, కేసుల గురించి జగన్ భయపడాల్సిన పని లేదని, అందులోనూ ఛార్జ్ షీట్ లో 1200 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నా, టీడీపీ వర్గీయులు లక్ష కోట్లు అవినితీ జరిగిందని ప్రచారం చేస్తున్నా వైసీపీ నాయకులు తిప్పి కొట్టడం లేదని ఒక విధమైన ఆవేదనతో కూడిన అభిమానాన్ని వ్యక్తపరిచారు.
ఉండవల్లి వ్యాఖ్యలను పరిశీలిస్తుంటే… జగన్ పార్టీలో తన మాదిరి గట్టి ‘వాయిస్’ ఉన్న నేతలు లేరు… కాబట్టి తనను పార్టీలోకి ఆహ్వానిస్తే జగన్ కు అండగా, ప్రత్యర్ధి రాజకీయ పార్టీ పై తన వాగ్ధాటితో విరుచుకుపడతానన్న సంకేతాలు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఎప్పుడు ఎవరు పార్టీలోకి వస్తారా… అంటూ ఎదురుచూస్తున్న జగన్ వర్గాలకు ఉండవల్లి ‘వాయిస్’ వినపడడం లేదా? లేక దీని వెనుక ఏదైనా రాజకీయ “వ్యూహం” దాగి ఉందా? అన్న కోణాల్లో చర్చ జరుగుతోంది.





