‘తాను ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ప్రధానిని కలిస్తే, తనపై ఉన్న కేసుల నిమిత్తం కలిసారని, అధికార తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోందని’ పలు సందర్భాలలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సందర్భాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజమే కాబట్టి, ఒక విధంగా ఈ ఆరోపణలు సర్వసాధారణమైపోయాయి. కానీ, వీటికి ప్రస్తుతం బలం చేకూరింది. ఎందుకంటే, జగన్ బండారం బట్టబయలు అయ్యే విధంగా ప్రధాని సమర్పించిన జగన్ వినతి పత్రాలను ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ప్రచురించింది.
తనపై కేసులను ప్రస్తావిస్తూ… ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేధిస్తోందని, ఓ ఇద్దరు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని… తన ఆవేదనను అంతా 7 పేజీల లేఖలో ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించారు. అయితే ఈ భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్… అసలు తన కేసుల విషయం ప్రస్తావించకపోగా, ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరించడానికి అవతరించిన మహోన్నత వ్యక్తిలాగా ఓ భారీ స్పీచ్ నే ఇచ్చారు. అసలు గుట్టు ఎన్నాళ్ళో దాగదు అన్న విషయం బట్టబయలు కావడంతో… ప్రస్తుతం మీడియాలో జగన్ – మోడీల భేటీనే హాట్ టాపిక్ అయ్యింది.
నిజానికి దీనికి సంబంధించి ఆ రోజే సోషల్ మీడియాలో జగన్ – మోడీలకు సంబంధించి అనేక ఫోటోషాప్ ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ‘తనపై ఉన్న కేసుల నుండి రక్షించండి మహాప్రభో… అన్నట్లుగా మోడీ ముందు జగన్ మోకరిల్లి’ ఉన్న పలు ఫోటోలు ఈ సందర్భంగా హల్చల్ చేసాయి. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోషాప్ ఫోటోలు కామన్ కావడంతో, ఓ లుక్ వేసి వదిలేసారు. అయితే నాడు చక్కర్లు కొట్టిన ఫోటోల ఆంతర్యం నిజమేనని, సదరు దినపత్రిక కధనం స్పష్టం చేసింది. సినీ నటులనే తలదన్నే విధంగా జగన్ ప్రదర్శించిన నటనా ప్రతిభను చూసి ముగ్దులవ్వడం రాష్ట్ర ప్రజల వంతయ్యింది.
అడగకపోయినా, అవసరం లేకపోయినా, రాష్ట్రపతి ఎన్నికలలో తమ మద్దతు మీకే ఉంటుందని జగన్ చెప్పిన మాటల్లో అసలు ‘రహస్యం’ బట్టబయలు కావడంతో, తదుపరి ఈడీ విచారణ ఎలా సాగుతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది. జగన్ ఇచ్చిన ఆఫర్లకు మోడీ లొంగుతారా? అంటే అది వైసీపీ అధినేత కలగానే భావించాలేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు విషయం బయటపడింది గనుక, బిజెపి ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదన్నది లేటెస్ట్ విశ్లేషణ. ఒకవేళ అదే జరిగితే, జగన్ తో పాటుగా ప్రధాని మోడీతో సహా బిజెపి కూడా ఇరుకున పడ్డట్లే కదా! దీంతో సదరు దినపత్రిక కధనం జగన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోందని చెప్పడంలో సందేహం లేదేమో!



