ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష వైఖరిపై గవర్నర్ కు కంప్లయింట్ చేశారు. సహజంగా మీడియా ముందుకు రాని జగన్ ప్రెస్ మీట్ పెట్టి … ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“కరోనాకు ఎన్నికల వాయిదాకు సంబంధం ఏంటి? చంద్రబాబు కోసమే ఎన్నికలు వాయిదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రమేష్ ను ఈసీగా నియమించారు. చంద్రబాబు, రమేష్ ది ఒకే సామజిక వర్గం. పేదలకు మంచి జరగడం ఈసీకి ఇష్టం లేదు,” అంటూ జగన్ తీవ్రంగా విమర్శించారు.
అదే పనిగా ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కోడ్ కొనసాగించడానికి కుదరదని జగన్ చెప్పుకొచ్చారు. “ఇప్పుడు గవర్నర్ కి చెప్పాం. తీరు మారకపోతే ఇది ఇంకా పైకి తీసుకుని పోతాం,” అంటూ జగన్ హెచ్చరించారు. అయితే జగన్ వైఖరిని రాజకీయ నిపుణులు తప్పుపట్టారు.
“ఒక పక్కన 2000 పై చిలుకు ఎంపీటీసీలు…125 జెడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచాం అని జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకపక్క కోడ్ ని తప్పు పడతారు. కోడ్ ఈ ఆరు వారాల పాటు ఉండకూడదు అని జగన్ అనుకుంటే మొత్తం ఎన్నికల ప్రక్రియను రూల్స్ ప్రకారం రద్దు చెయ్యాలి. ఆ ఏకగ్రీవాలు కావాలంటే మాత్రం కోడ్ ఉండాల్సిందే. ఏకగ్రీవాలు కావాలి.. కోడ్ వద్దు అంటే కుదరదు,” అని వారు చెబుతున్నారు.





