పెద్దమనిషి ముసుగు ధరించి నటించడం చాలా కష్టం గురూ!

YS-Jagan-Nethanna-Nesthamరాజకీయపార్టీలు ప్రత్యర్ధి పార్టీపై పైచేయి సాధించేందుకు నైతిక విలువలను పక్కన పెట్టి ఓ మెట్టు దిగితే, ప్రత్యర్ధులు కూడా మరో రెండు మెట్లు దిగుతారు. చివరికి వారికే ఆ బురద అంటుకొంటుందని చాలాసార్లు చెప్పుకొన్నాము. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో అదే జరుగుతోంది.

ADVERTISEMENT

వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర ఆరోపణలు చేయడంతో అధికారపార్టీ విలవిలలాడుతూ ఎదురుదాడి చేస్తోంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి వెన్నెముక వంటిది కనుక. పవన్‌ కళ్యాణ్‌ ఆ వెన్నెముకను విరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు కనుక.

ఒకవేళ వైసీపీ చెప్పుకొంటున్నట్లు వాలంటీర్ వ్యవస్థ కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నట్లయితే ఇంతగా స్పందించాల్సిన అవసరమే ఉండదు కదా?

ఓ పక్క మంత్రులు పవన్‌ కళ్యాణ్‌ మీద విరుచుకుపడుతుండగానే, ఈరోజు సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ‘నేతన్నల నేస్తం’ సభలో చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే సిఎం హోదాలో ఉన్నాననే సంగతి కూడా మరిచిన్నట్లు చాలా అనుచితంగా మాట్లాడారు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రతీ నాలుగేళ్ళకు భార్యలను మారుస్తుంటారని, అక్రమ సంబంధాలు కూడా నడుపుతుంటారని విమర్శించారు. నారా లోకేష్‌ మద్యం తాగుతూ అరడజను మంది అమ్మాయిలను పక్కన పెట్టుకొని స్విమ్మింగ్ పూల్లో జలకాలాడుతారని ఎద్దేవా చేశారు. అన్‌స్టాపబుల్ షోలో నందమూరి బాలకృష్ణ ఓ చిలిపి ప్రశ్నకు చంద్రబాబు నాయుడు చిలిపిగా చెప్పిన సమాధానాన్ని పట్టుకొని 75 ఏళ్ళు వయసున్న ఆ పెద్దమనిషికి సిగ్గూశరం లేదని ఆక్షేపించారు. టిడిపిలో మరోనేత అమ్మాయిలు కనిపిస్తే ముద్దు అయినా పెట్టుకోవాలని లేదా కడుపు చేయాలని అంటారని జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. ఇటువంటి క్యారక్టర్ లేనివారా… మన వాలంటీర్లను విమర్శించేది?అని జగన్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నోట ఇంత అనుచితమైన మాటలు వింటామని బహుశః ఎవరూ ఊహించి ఉండరు.

నిజమే! వాలంటీర్లు అందరూ ఇరుగుపొరుగు వారే. టంచనుగా పింఛన్ తెచ్చి చేతికి అందిస్తున్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ లేవనెత్తిన మిగిలిన ప్రశ్నల మాటేమిటి?

అసలు వారికి బాస్ ఎవరు? ముఖ్యమంత్రా?ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా?లేక మరెవరైనానా?అని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నకు జవాబు చెప్పరు. వారికి రోజుకు రూ.164.33 మాత్రమే జీతంగా చెల్లిస్తూ వైసీపీ వారి శ్రమను దోచుకొంటోందని చేసిన ఆరోపణకు సమాధానం ఉండదు. నెలకు కేవలం రూ.5,000 జీతం చెల్లిస్తూ వాలంటీర్లు మరే ఉద్యోగం, ఉపాధి సంపాదించుకొనీయకుండా వారి జీవితాలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందనే పవన్‌ కళ్యాణ్‌ విమర్శలకు సమాధానం చెప్పరు. వాలంటీర్ల చేత ప్రజల వ్యక్తిగత వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వరు. కానీ వాలంటీర్ల కోసం ప్రత్యర్ధులతో ఈస్థాయిలో యుద్ధాలు చేస్తుంటారు.

నిజానికి వైసీపీలో కొందరు మంత్రుల గంట, అరగంట బూతు భాగోతాలు, ఓ ఎంపీ డర్టీ పిక్చర్, మరో ఎమ్మెల్యేల బూతులు, క్యాసినోలు, గురించి మీడియాలో, సోషల్ మీడియాలో చాలా కాలం కధకధలుగా వచ్చాయి కదా?

ఓ మహిళా మంత్రి ‘నవరంద్రాలు…. ఈకలు’ అంటూ మాట్లాడుతుండటం అందరూ వింటూనే ఉన్నారు కదా?ఓ ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ఎంపీ వివేకా హత్య కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా?

వైసీపీలో ఇంతమంది రసికరాజులను, కళాపోషకులను పెట్టుకొని ఎదుటవాళ్ళపై బురద జల్లితే, అవతలి నుంచి ఎటువంటి జవాబులు వస్తాయో తెలీదా?

అధికార పార్టీలో ఉన్నవారు ఎంత హుందాగా వ్యవహరిస్తే ప్రజలలో వారికే అంత గౌరవం పెరుగుతుంది. కానీ ప్రత్యర్ధులను ఈసడించుకొనే ప్రయత్నంలో తాము ధరించిన పెద్దమనిషి ముసుగులు తీసేస్తే వారి అసలు రూపమే బయటపడుతుందని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories