పంచాయతీ ఎన్నికలు తప్పని పరిస్థితులలో అధికార పార్టీ కొత్త అస్త్రం సంధించింది. పల్లెలు ప్రశాంతంగా ఉండాలని, పార్టీ రహిత ఎన్నికలు కాబట్టి ఏకగ్రీవాలు ఎక్కువగా చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. అలా ఏకగ్రీవాలు జరిగిన పల్లెలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నగదు ఇస్తుందని వాటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఫుల్ పేజీ యాడ్లు ఇస్తుంది.
అయితే ఎన్నికలలో కొన్ని మంచివి… కొన్ని చెడ్డవి ఎందుకు ఉంటాయి? పంచాయితీ ఎన్నికల వల్ల గ్రామాలలో ప్రశాంతత పోయే పరిస్థితి ఉంటే అసెంబ్లీ ఎన్నికల వల్ల రాష్ట్రంలో ప్రశాంతత పోయే ప్రమాదం ఉంటుంది కదా? అసెంబ్లీకి కూడా ఎన్నికలు వద్దని ఏకగ్రీవం చేసేసుకుంటారా?
రేపు కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రానికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరుపుకుంటే అదనంగా 10,000 కోట్లు ఇస్తాం అంటే రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా? అయితే స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికే ఈ ప్రశాంతత, పోటీలు ఉండకూడదు అని ఎందుకు అంటారో మరి. ఈ ఏకగ్రీవాలు ఎక్కువగా అధికార పార్టీకి మేలు చేసేవే.
పార్టీ రహిత ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే.. పార్టీలు అనధికారికంగా అభ్యర్థులను పెట్టకూడదు. స్థానికులను, యువకులను ప్రోత్సహించి గ్రామాలను వారికే వదిలేయ్యాలి. ఈ నజరానాలు కంటే కూడా అధికార పార్టీ తమ తరపున అభ్యర్థులను పెట్టకుండా ఆదర్శంగా నిలిచి పల్లెలలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి.






