ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలలో ఇది చాలా కామన్. కనుక ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి పెళ్లి పత్రిక అందజేసి ఆహ్వానించారు.
ఆ తర్వాత ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ మంత్రులు, నేతలను కూడా కలిసి ఆహ్వానించవచ్చు. కనుక దీనిలో రాజకీయం ఏమీ ఉండదు. కానీ దీనిపై వైసీపీ మండిపడుతూ సొంత మీడియాలో ‘బాబుతో చెట్టాపట్టాల్’ అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.
కాంగ్రెస్ అధినేత్రిగా సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన వైఎస్ షర్మిల, తన సొంత రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటున్నారా? అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వైసీపీ సొంత మీడియా పేర్కొంది.
అయితే ఆమె కూతురి పెళ్లి ఖాయం అయిన తర్వాత మొట్టమొదట తన అన్న, వదినలకు శుభలేఖ ఇచ్చి ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు వారు కనీసం మర్యాదకైనా ఆమెను కలవలేదు. అక్కడి సిబ్బందికి కార్డు ఇచ్చి తిరిగి రావాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆమె బెంగళూరులోని తమ ‘యలహంక ప్యాలెస్’లో కూతురు పెళ్లి చేసుకోవాలనుకుంటే దానికీ జగన్ అభ్యంతరం చెప్పారు.
సొంత చెల్లితో ఈ విధంగా వ్యవహరించినందుకు సోషల్ మీడియాలో, బయట ఆయన రాజకీయ ప్రత్యర్థులు జగన్ తీరును తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేస్తే వాటినీ తప్పుపట్టారు. కానీ రాజకీయాలలో సత్సంప్రదాయాలు పాటిస్తూ వైఎస్ షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి కూతురు పెళ్లికి ఆహ్వానించడం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆమె కూతురు పెళ్లికి జగన్ హాజరవుతారో లేదో ఇంకా తెలియదు. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులందరూ తప్పక హాజరవుతారు.
కనుక ఈ కడుపు మంట ఇప్పట్లో చల్లారేది కాదు. దానిని ‘ఇనో’ కూడా తగ్గించలేదు. కానీ తగ్గించగలిగితే ఆ కంపెనీకి ఇదే ఒక చక్కటి వాణిజ్య ప్రకటనగా ఉపయోగపడుతుంది.





