వైసీపీ అధినేత జగన్-షర్మిల మధ్య రాజకీయ పదవులు, ఆస్తి వివాదాలు ఏర్పడినప్పుడు ఆమె కుటుంబ గౌరవం దృష్టిలో ఉంచుకొని మౌనంగా తెలంగాణకు వెళ్ళిపోయారు.
కానీ అనూహ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మళ్ళీ ఆంధ్రాకు వచ్చారు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె వైసీపీ.. దాని అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయక తప్పలేదు. ఆ ప్రయత్నంలో ఆమె తనకు అన్న వలన జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారు. విమర్శలు గుప్పించారు.
ఆమె మాటలు జగన్‌కు ఆగ్రహం కలిగించడం సహజం. కనుక అయన కూడా ఆస్తుల పంపకాల విషయంలో కోర్టుకు వెళ్ళారు. అప్పటి నుంచే వారి ఆస్తుల పంచాయతీ ‘పబ్లిక్ టాపిక్’గా మారింది.
కనుక మీడియాతో సహా వారి రాజకీయ ప్రత్యర్ధులు ఈ అంశంపై తమ అభిప్రాయాలు లేదా వ్యాఖ్యలు, విమర్శలు వినిపిస్తున్నారు. రాజకీయాలలో ఇది సర్వసాధారణమే.
సాక్షి, భారతి సిమెంట్స్‌లో 60:40 నిష్పత్తిలో వాటాల పంపిణీకి జగన్ ప్రతిపాదించారని, అందులో 40 శాతం వాటా తనకు రావాల్సి ఉందని షర్మిల ఇదివరకు ఓ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
వారిరువురి ఆస్తుల పంపకాల వ్యవహారం కోర్టులో ఉండగా, వాటిలో భాగస్వామిగా భావించబడుతున్న వైఎస్ షర్మిలపై సాక్షి మీడియాలో ‘బాబుతో చెట్టాపట్టాల్’ అంటూ వరుస కథనాలు ప్రచురించడం సమంజసమేనా? అని ఆమె స్వయంగా ప్రశ్నించారు.
ఆస్తుల విషయంలో చెల్లితో సమస్యలు ఉంటే ఉండొచ్చు కానీ మహిళలను గౌరవిస్తానంటూనే సొంత చెల్లి పట్ల వ్యక్తిత్వ హననం చేయడాన్ని ఏవిధంగా సమర్ధించుకోగలరు?సొంత చెల్లిపై సాక్షి అస్త్రం సందిస్తుంటే వారించాల్సిన బాధ్యత ఒక అన్నగా జగన్‌పై ఉండదా?
సొంత చెల్లి పట్ల ఈవిధంగా వ్యవహరిస్తున్నప్పుడు, రాష్ట్రంలో మహిళల పట్ల గౌరవం ఉందని చెప్తే నమ్మశక్యంగా ఉంటుందా?
ఆస్తి తగాదాలు చాలా కుటుంబాలలో ఉంటాయి. కనుక వారి ఆస్తుల పంచాయతీని రాష్ట్రంలో మహిళలు పట్టించుకోకపోవచ్చు. కానీ సాక్షిలో వైఎస్ షర్మిలపై రాస్తున్న రాతల కారణంగా రాష్ట్రంలో మహిళలు, ఇది జగన్ రాయిస్తున్న రాతలే అని భావిస్తే వారు వైసీపీకి వ్యతిరేకంగా మారకుండా ఉంటారా? దాని వలన వైసీపీ నష్టపోతే అందుకు సాక్షి పూర్తి బాధ్యత స్వీకరిస్తుందా?
ఆస్తులు పంపకాల సంగతి కోర్టులో తేల్చుకోవచ్చు. కానీ వాటి కోసం ఈవిధంగా వ్యవహరిస్తూ రాజకీయంగా నష్టపోవడం అవసరమా?అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.





