రాజకీయాల పరంగా జగన్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానూ, విమర్శలకు తావిచ్చేవిగా ఉంటాయి. అమరావతి శంకుస్థాపనకు వెళ్ళకుండా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న జగన్, వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసినా పోటీ చేసి కేసీఆర్ కు సహకారం అందించారన్న విమర్శను మూటకట్టుకున్నారు. ఇక, ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా… అసభ్య పదజాలాన్ని వాడిన రోజాను వెనుకేసుకొచ్చి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇలా ఏ సందర్భం చూసుకున్నా జగన్ నిర్ణయాలు విమర్శల వైపుకే తప్ప ప్రశంసలకు ఆస్కారం ఇవ్వడం లేదు. అయితే తొలిసారిగా ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుకున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటీచేయకూడదని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలంగాణ వైసీపీ ప్రకటించింది. ముందు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని తెలిపింది. పార్టీలన్నీ డబ్బు వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ ఆరోపించింది.
అయితే ఈ గ్రేటర్ ఎన్నికల బరిలో నుండి తప్పుకోవడం కూడా హైదరాబాద్ లో అంతంత మాత్రమే ఉన్న టీఆర్ఎస్ ఓట్లను చీల్చడం ఇష్టం లేకనే అన్న రాజకీయ విమర్శ వ్యక్తమవుతున్నప్పటికీ, పార్టీ పరంగా ఓ మంచి నిర్ణయం తీసుకున్నట్లే భావించవచ్చు. ఒకవేళ పోటీ చేసినప్పటికీ, ఒక్క స్థానం కూడా వైసీపీ వశం అయ్యే అవకాశాలు లేవని ఇటీవల సర్వేలు స్పష్టం చేసాయి. పోటీ చేసినా పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ, ఓట్లను చీల్చే ప్రమాదం ఉండడంతోనే జగన్ పార్టీ వెనుకడుగు వేసినట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.





