‘బ్రాండెక్స్’ కంపెనీ కార్మికుల వెతలు తీర్చేందుకు విశాఖ వెళ్ళిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి రూపంలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే కార్యకర్తలతో సమావేశమై ఒక నిర్ణయం తీసేసుకున్నారని, పార్టీ మార్పుకు సరైన ముహూర్తం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎస్వీ చేరికతో కర్నూల్ జిల్లా రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది. ఇప్పటివరకు జిల్లాలో టిడిపి కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వైసీపీ సంఖ్య అధికార పార్టీ కంటే తగ్గిపోనుంది.
గడచిన ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ సీట్లు ఉండగా… 11 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటింది. అయితే ఆదిలోనే వైసీపీకి ఝలక్ ఇస్తూ, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీకి చేరువయ్యారు. ఆ తర్వాత కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక కూడా టీడీపీ దరికి చేరినా… ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇక, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలలో భాగంగా, వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి (నంద్యాల), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), మణిగాంధీ (కోడుమూరు), బుడ్డా రాజశేఖరరెడ్డి (శ్రీశైలం) టీడీపీలో చేరిపోయారు.
తాజాగా ఎస్వీ మోహన్ రెడ్డి చేరికతో టిడిపి బలం మరింత పుంజుకోనుంది. గత ఎన్నికల్లో టిడిపి తరపు నుండి పోటీ చేసిన టీజీ వెంకటేష్ పై విజయం సాధించిన ఎస్వీ మోహన్ రెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పని చేసారు. దీంతో తెలుగుదేశం పార్టీలోకి ఎస్వీ రాక కొత్త పరిణామం ఏమీ కాకపోయినా… జగన్ కు మాత్రం జలక్ ఇచ్చే అంశమే. పార్టీ మారుతున్న వారి పేరు తెరపైకి రాగానే తన అనుచరులను పంపించి చర్చిస్తున్న జగన్, ఎస్వీ మోహన్ రెడ్డికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో మరికొద్ది గంటల్లో తెలిసిపోవచ్చు.





