వైసీపి నేతలు టిడిపిలోకి క్యూ… అంటే అర్దం ఏమిటి సజ్జల వారు

Vasantha-krishna-prasad-TDP

నీరు పల్లమెరుగు…నిజం దేవుడెరుగు అనే మాట అక్షరాల ఏపీ రాజకీయాలకు సరిపోతుంది. రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ఏదైనా ఓ పార్టీకి క్యూ కడుతున్నారనే అర్దం ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్దం.

ADVERTISEMENT

ప్రస్తుతం వైసీపి నేతలు టిడిపిలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే వైసీపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి, కోనేటి ఆదిమూలం, ఇంకా పలువురు టిడిపిలో చేరిపోగా నేడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరిపోయారు.

నేడో రేపో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టిడిపిలో చేరబోతున్నారు. మరో 10-15 మంది ఎమ్మెల్యేలు, 4-5 ఎంపీలు టిడిపి వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టిడిపిలో ఇప్పటికే హౌస్‌ఫుల్ బోర్డు పెట్టేయడం వలన చేర్చుకోలేని పరిస్థితి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపిలో టికెట్లు లభించనివారు పార్టీని వీడి టిడిపిలోకి వస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. కానీ టికెట్స్ ఇస్తున్నా వద్దని చెప్పి వైసీపికి రాజీనామాలు చేసి టిడిపిలో చేరిపోతుండటం గమనిస్తే నీళ్ళు పల్లమెరుగు… రాజకీయ నాయకులు గెలిచే పార్టీని ఎరుగు అని అనుకోవాలేమో?

ఇక నిజం దేవుడెరుగు… అంటే వివేకా హత్య కేసు గురించే చెప్పుకోవలసి ఉంటుంది. సీబీఐ, వివేకా కుమార్తె సునీతా రెడ్డి, జగన్‌ సొంత చెల్లి వైఎస్ షర్మిల, ఈ కుట్రలో పాల్గొన్న దస్తగిరి, ఇంకా అనేక సాక్ష్యాధారాలు, ప్రతిపక్షాలు, ఈ కేసు విచారణ సాగుతున్న తీరు… అన్నీ వైసీపీవైపే వేలెత్తి చూపిస్తున్నాయి.

కానీ టిడిపి నేతలే వివేకాని దారుణంగా హత్య చేశారని సజ్జల రామకృష్ణా రెడ్డి వాదిస్తున్నారు. తండ్రి హంతకులతో సునీతా రెడ్డి, వారితో వైఎస్ షర్మిల ఇద్దరూ చేతులు కలిపి, కారణ జన్ముడైన భగవంతుని అంశంతో పుట్టిన జగన్మోహన్‌ రెడ్డిని నిందిస్తున్నారని వైసీపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దానిలో సజ్జల రామకృష్ణా రెడ్డే చక్రం తిప్పుతున్నారు. కనుక పోలీస్, దర్యాప్తు సంస్థలన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. వివేకా హంతకులు ఎవరో కూడా ఆయనకు తెలుసు, నిరూపించగలనని చెపుతున్నారు. మరి వారిపై ఎందుకు కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయలేదో ఆయనకే తెలియాలి.

ప్రతిపక్షాలు ‘హూ కిల్డ్ బాబాయ్?’అని అడుగుతుంటే, వైసీపి ఎమ్మెల్యే పేర్ని నాని వంటివారు కూడా ‘హూ కిల్డ్ బాబాయ్?’ అని అడుగుతున్నారు! వివేకాని ఎవరు చంపారో అందరికీ తెలుసు కానీ సీబీఐకి, కోర్టులకు మాత్రమే తెలీదు. కనుక ఈ హత్యని దేవుడి పద్దులో వ్రాసి దణ్ణం పెట్టి ఊరుకోక తప్పదేమో?

ADVERTISEMENT
Latest Stories