“మీ జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందింది?”అని ఎవరైనా ప్రశ్నిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు తడుముకోకుండా గడగడ సంక్షేమ పధకాల వివరాలు చెపుతుంటారు. వారి దృష్టిలో అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే కనుక అదే అభివృద్ధి అని ప్రజలు కూడా సరిపెట్టుకోవాలి.
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సమయంలో ఇటువంటి తాయిలాలు పంచిపెడుతుంటుంది. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరుతో గత మూడేళ్ళుగా ఓటర్లకు లక్షల కోట్లు పంచిపెడుతూనే ఉంది.
“మా సంక్షేమ పధకాలే మాకు శ్రీరామరక్ష అని, ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సేవలు మాకు అవసరం లేదని” సజ్జల రామకృష్ణారెడ్డి రెండు నెలల క్రితం ప్రకటించారు. కానీ ప్రశాంత్ కిషోర్ అధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ పోలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) సేవలను వైసీపీ ఉపయోగించుకొంటూనే ఉంది.
ఇప్పుడు ఎన్నికలంటే కేవలం పార్టీ సిద్దాంతాలు, ఆశయాలు ప్రజలకు చెప్పుకొని, యధాశక్తిన డబ్బు, మద్యం, బహుమతులు పంచితే సరిపోదు. ప్రత్యర్ధులను మానసికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా, అనైతికంగా దెబ్బ తీయడం కూడా తప్పనిసరి అయిపోయింది.
అందుకే వైసీపీ టిడిపిలో ముఖ్యనేతల ఆర్ధికమూలాలను దెబ్బతీస్తూ వారిని పైన పేర్కొనట్లు అన్ని విదాలుగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ జాబితాలో టిడిపి నేతలు దూళిపాళ నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు తదితర నేతలు బాధితులుగా ఉన్నారు.
కానీ ఇకపై ప్రధానంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (కుప్పం), నారా లోకేష్ (మంగళగిరి), నందమూరి బాలకృష్ణ (హిందూపురం), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి), అచ్చెన్నాయుడు (టెక్కలి)లను లక్ష్యంగా చేసుకొని వారి నియోజకవర్గాలలోనే వారిని దెబ్బతీయాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ ఐదు నియోజకవర్గాలపై మరింత ఎక్కువగా దృష్టిపెట్టి వారి బలాబలాలు, బలహీనతలను కనుగొనవలసిందిగా వైసీపీ అధిష్టానం ఐప్యాక్‌ను కోరినట్లు సమాచారం. అలాగే టిడిపిలో కీలకంగా వ్యవహరించే ముఖ్య నేతలను కార్నర్ చేసేందుకు గల అవకాశాలను పరిశీలించమని కోరినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కుప్పంలో వైసీపీ చేస్తున్న హడావుడి గమనిస్తే ఇది నిజమని అర్దమవుతుంది.
సంక్షేమ పధకాల పేరుతో ఓటర్లకు డబ్బు పంచిపెడుతున్నా, ఐప్యాక్ సేవలు వినియోగించుకొంటున్నా వైసీపీలో ఇంకా ఏదో తెలియని అభద్రతాభావం వెంటాడుతూనే ఉందని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. అంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుపు అంత సులభం కాదని అర్దమైనట్లే ఉంది.



