వైసీపీపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ అది రాజకీయాలు చేసే తీరు పూర్తి భిన్నమైనదని అందరూ అంగీకరిస్తారు. మరోవిధంగా చెప్పాలంటే, సాంప్రదాయ రాజకీయాలు జరిగే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సరి కొత్త రాజకీయాలు ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు.
నాటి ఓదార్పు యాత్రలు మొదలు ఫ్లెక్సీ రాజకీయాలు, ప్యాలస్ రాజకీయాలు, పరామర్శ యాత్రల పేరుతో బలప్రదర్శనలు, వాటిలో రప్పారప్పాలు వంటివి చాలానే కనిపిస్తాయి.
అలాగే కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు కాపుల పేరుతో, సోషల్ మీడియాలో చేస్తున్న రాజకీయాలు, ఢిల్లీ ఆందోళనల స్పూర్తితో చేస్తున్న డీఎస్సీ రాజకీయాలు ఇలా ఒకటా.. రెండా… అనేక సరికొత్త ట్రెండ్స్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తోంది.
కనుక కూటమి ప్రభుత్వం కేవలం పాలన, అభివృద్ధిపై దృష్టి పెడితే చాలదు. తప్పనిసరిగా వైసీపీని ఓ కంట కనిపెడుతూ, ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కొంటూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. లేదా వచ్చే ఎన్నికల నాటికి కూటమి విచ్చినమైపోవచ్చు.
ఎన్డీయే సోషల్ మీడియా కో-ఆర్డినేషన్ కమిటీ చేసిన తాజా ప్రకటన ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ మరో సరికొత్త పద్దతిని ప్రవేశపెట్టిందని, మూడు పార్టీల అభిమానులు లేదా మద్దతుదారుల ముసుగులో మిగిలిన రెండు పార్టీల నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ కూటమిలో చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తోందని ఆ ప్రకటనలో పేర్కొంది.
కనుక మూడు పార్టీల శ్రేణులు వాటిని చూసి ఆవేశంగా పరస్పరం కీచులాడుకోవద్దని, వాటిని తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలని ఆ ప్రకటనలో సూచించింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్యాలస్‌లో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారంటూ కూటమి నేతలు భుజాలు చరుచుకుంటున్నారు. కానీ జగన్ ప్యాలస్‌లో నుంచి కాలు బయటపెట్టకుండానే వారికి ప్రతీరోజూ ఓ కొత్త అగ్నిపరీక్ష పెడుతూనే ఉన్నారు. ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుగా?
ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత వైసీపీ పరిస్థితి ఏవిధంగా ఉండేది? ఇప్పుడు ఏవిధంగా ఉంది? అని పోల్చి చూసుకుంటే అర్ధమవుతుంది. వైసీపీ ఎంచుకున్న మార్గం సరైనది కాకపోవచ్చు కానీ అది మళ్ళీ అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త వ్యూహాలు అమలుచేస్తూ ముందుకు సాగుతోంది. కనుక బంతి కూటమి కోర్టులోనే ఉన్నట్లు లెక్క!




