పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలే అయినప్పటికీ, ఆయా పార్టీల మద్దతుదారులే పోటీ చేస్తారనేది అందరికీ తెలుసు. కనుక ఈ గెలుపోటములు ఆయా పార్టీల పద్దులోనే జమా అవుతుంటాయి.
మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చాలా స్పష్టంగా కనిపించింది. జగన్ పేరు, ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకున్న అభ్యర్ధులను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు.
కానీ స్థానికంగా అందరితో కలిసి మెలిసి మెలిగే వారిని పార్టీలు చూడకుండా గెలిపించారు. వైసీపీ మద్దతుదారులలో ఆవిధంగా గెలిచినవారే ఎక్కువున్నారు.
మరో విశేషం ఏమిటంటే, సీట్ల సర్దుబాట్ల విషయంలో పలు జిల్లాలలో కూటమి పార్టీల మధ్య పరస్పర అవగాహన కొరవడినప్పటికీ గ్రామీణ ప్రజలు కూటమి మద్దతుదారులనే గెలిపించారు. కానీ వైసీపీ నేతలు తమ మద్దతుదారులకు అన్ని విధాల సహకరించినప్పటికీ ఓటమి తప్పలేదు.
ఈ స్థాయి ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి మొగ్గు చూపడం సాధారణమే. అయినా కూడా గ్రామాలలో ప్రతిపక్ష పార్టీ (వైసీపీ) ఓటు బ్యాంకు చెక్కు చెదరదు. కనుక పంచాయతీ ఎన్నికల్లో వారి ఓట్లు అన్నీ వైసీపీకే ఖచ్చితంగా పడి ఉండాలి. కానీ పడలేదు!
ఒకప్పుడు వైసీపీకి గ్రామాలలో 39 శాతం ఓట్లు ఉండేవి. అవి ఈ మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 24.6 శాతానికి అంటే ఒకేసారి 15.6 శాతం తగ్గిపోయిందన్న మాట!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంత బలం ఉండటం, ఇప్పుడు తగ్గడం సర్వసాధారణమే అనుకోవడానికి లేదు. ఎందువల్లనంటే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా పరామర్శ యాత్రలకు బయలుదేరితే ఊరూవాడ ఏకమైనట్లు వేలాదిమంది తరలివస్తుంటారు. అది జనసమీకరణ కాదని జగన్‌కున్న జనాధరణ అని వైసీపీ నేతలు, వారి సొంత మీడియా గొప్పగా చెప్పుకుంటాయి. వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర మొదలుపెడితే ఇక టీడీపికి దబిడ దబిడే.. ‘జగన్ 2.0’ ఖాయం అని బల్లగుద్ది వాదిస్తుంటారు కూడా.
కానీ తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే వారు చెప్పుకుంటున్న మాటలకు, వారి బలప్రదర్శనలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మిగిలిన రెండు దశల పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఇలాగే ఉండే అవకాశం ఉంది.
అదే కనుక జరిగితే గ్రామాలలో వైసీపీ పట్టుకోల్పోయినట్లే భావించవచ్చు. అయితే కూటమి పార్టీలు గ్రామాలలో ఆ పట్టు నిలుపుకోవడమే ముఖ్యం. అప్పుడే వచ్చే శాసనసభ ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీ లభిస్తుంది.




