వైసీపీకి డౌట్… అందుకే విజయసాయి అటాక్?

Purandeswari-Vijayasai Reddy

దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులైనప్పటి నుంచి వైసీపి ఎంపీ విజయ సాయిరెడ్డి ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆమె చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించినప్పటి నుంచి ఆ విమర్శల జోరు మరింత పెరిగింది. ఇప్పుడు ఆ జోరు మరింత పెంచి వ్యక్తిగత దూషణలు మొదలుపెట్టారు.

“ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం.

ADVERTISEMENT

తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిది.

ఆంధ్ర ప్రదేశ్ ను అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా తనవంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఈ పురంధరేశ్వరి,” అంటూ ఎద్దేవా చేశారు.

వీటిని రోటీన్ విమర్శలుగా కొట్టిపారేయలేము. ఆమె బీజేపీని టిడిపితో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం వైసీపికి కలిగిన్నట్లే ఉంది. ఏపీలో బీజేపీని వదులుకోవడానికి సిద్దపడి టిడిపితో పొత్తులు పెట్టుకొన్న పవన్‌ కళ్యాణ్‌, ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసిన తర్వాత తెలంగాణలో బీజేపీతో పొత్తులు పెట్టుకోవడంతో వైసీపిలో ఆందోళన మొదలైన్నట్లుంది.

ఏపీలో టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా చేతులు కలిపితే ఎన్నికలలో వైసీపి ఓటమి ఖాయం. ఇదే సమయంలో అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైసీపి ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా, జగన్, విజయ సాయిరెడ్డి తదితరుల బెయిల్‌పై రద్దు చేయాలని పురందేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాశారు.

ఈ పరిణామాలన్నిటినీ కలిపి చూస్తే, మోడీ, అమిత్ షాల వైఖరిలో మార్పు వస్తోందని, కనుక మళ్ళీ తమకు మళ్ళీ చెడ్డరోజులు మొదలవబోతున్నాయని విజయ సాయిరెడ్డి పసిగట్టిన్నట్లే ఉన్నారు. బహుశః అందుకే దగ్గుబాటి పురందేశ్వరి మీద వ్యక్తిగత దూషణ చేస్తున్నట్లున్నారు.

అయితే ఆమెను ఈ విదంగా దూషిస్తుంటే, మోడీ, అమిత్ షాలు చూస్తూ సహిస్తారనుకోవడం అవివేకమే. దీనికీ విజయ సాయిరెడ్డి వేరేగా మూల్యం చెల్లించవలసి రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories