జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షెడ్యూల్ విడుదల చేసింది ఆ పార్టీ. కనుక మాజీ సిఎం ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవచ్చు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి తరపున సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
ఈ ఉప ఎన్నికలలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని కల్వకుంట్ల కవిత చెప్పిన మాట అక్షరాల వాస్తవమే. కనుక ఈ గెలుపోటములు, వాటి ప్రభావం, పర్యవసానాలు ఆయా పార్టీల పద్దులోనే జమా అవుతాయి.
ఈ లెక్కన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే ఆ క్రెడిట్ సిఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. స్వయంగా ప్రచారంలో పాల్గొని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ సీటుని కాంగ్రెస్ పార్టీకి దక్కించారనే క్రెడిట్ లభిస్తుంది. ఈ సీటు గెలుచుకుంటే కాంగ్రెస్ పాలన అధ్వానంగా ఉందనే బీఆర్ఎస్ పార్టీ వాదన కేవలం దుష్ప్రచారమేనని గట్టిగా చెప్పుకోగలుగుతారు.
ఒకప్పుడు ప్రతీ ఎన్నికలో అవలీలగా విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీని, ఈ ఉప ఎన్నికలో మరోసారి ఓడించగలిగితే ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలై చీలికకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కల్వకుంట్ల కవిత కనిపిస్తున్నారు కూడా. కనుక ఈ ఉప ఎన్నికలో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి చాలా అవసరం.
కాంగ్రెస్ పాలన గురించి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలన్నీ నిజం కాకపోవచ్చు. కానీ వాటిలో చాలా వాస్తవాలున్నాయి. ముఖ్యంగా నగరంలో హైడ్రా కూల్చివేతలతో సామాన్య ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కనుక ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ని కూల్చివేయడానికి హైడ్రా ఒక్కట్టే చాలు.
ఒకవేళ కాంగ్రెస్‌ని ఓడించగలిగితే బీఆర్ఎస్ పార్టీ పరువు దక్కుతుంది. మళ్ళీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కలుగుతుంది. అప్పుడు కల్వకుంట్ల కవిత ఆరోపణలకి కూడా ధీటుగా జవాబు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన చాలా అధ్వానంగా ఉంది కనుకనే ప్రజలు తిరస్కరించారని బీఆర్ఎస్ గట్టిగా చెప్పుకోగలుగుతుంది.
కనుక ఎన్నికల ప్రచారంలో పాల్గొని గెలిస్తే లభించే ఈ పనికిరాని క్రెడిట్ కోసం కక్కుర్తిపడితే ఓడిపోతే అపవాదు భరించడమే చాలా కష్టం. కనుకనే కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవచ్చు.
ఇక ఈ ఉప ఎన్నికలలో బీజేపి గెలిస్తేనే చాలా విచిత్రం ఓడిపోతే సమస్యే కాదు. కనుక ఈ ఉప ఎన్నిక ప్రజలకు ఏవిదంగానూ ఉపయోగపడదు కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల జరుగుతున్న ఆధిపత్యపోరు మాత్రమే. గెలిచినా ఓడినా వాటికే సంబంధం. వాటి లాభనష్టాలు వాటి పద్దులోనే నమోదవుతాయి.






