AB Venkaeswara Rao

ఇప్పుడు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులు ఆయా రాష్ట్రాలలో అధికార పార్టీలకు విధేయులుగా పని చేయక తప్పడం లేదు.

కేంద్రం పరిధిలో ఉండే వారిని రాష్ట్ర ప్రభుత్వాలు నిబందనల ప్రకారం ఏమీ చేయలేవు. వారు అధికార, ప్రతిపక్ష పార్టీలు, వాటి రాజకీయాలతో సంబందం లేకుండా ధైర్యంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలనే ఉద్దేశ్యంతోనే వారిని కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండేలా ఏర్పాటు జరిగింది.

Also Read – కవిత అనారోగ్యం ‘ఉపశమనాన్ని’ ఇస్తుందా.?

కానీ వారు రాష్ట్ర ప్రభుత్వాలను నడిపించే అధికార పార్టీల నేతల వలన నిత్యం అనేక సమస్యలు, ఒత్తిళ్ళు ఎదుర్కుంటున్నప్పుడు కేంద్రం వారికి అండగా నిలబడుతుంటే వారు ధైర్యంగా, నిష్పక్షపాతంగా పనిచేయగలిగేవారు.

ఉదాహరణకు జగన్‌ ప్రభుత్వం ఐపిఎస్‌ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుని ఎంతగా వేధించిందో అందరూ చూశారు. ఈ నెలాఖరుకి రిటైర్ కాబోతున్న ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇంకా వేదిస్తూనే ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు, కాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ఆదేశించినా ఆయనను జగన్‌ ప్రభుత్వం సర్వీసులో తీసుకోకుండా, జీతం చెల్లించకుండా ముప్పతిప్పలు పెడుతూ, ఆయనపై అవినీతిపరుడనే ముద్ర కూడా వేసి సమాజంలో ఆయన తలెత్తుకు తిరగలేని పరిస్థితి కల్పించింది. జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు డాక్టర్ సుధాకర్‌ని కూడా ఇదేవిదంగా వేదించి నడిరోడ్డుపై ఆయన బట్టలు ఊడదీసి అరెస్ట్ చేయించి, ఆయన ఓ మానసిక రోగి అని ముద్ర కూడా వేసి వేధిస్తే చివరికి ఆయన ఆ ఆవేదన భరించలేక గుండెపోటుతో చనిపోయారు.

Also Read – పద్మనాభ రెడ్డికి అంబటి అభినందనలు… శభాష్!

ఈ ఇద్దరి పరిస్థితిని కళ్ళారా చూస్తున్న రాష్ట్రంలోని ఏ అధికారి కూడా ధైర్యంగా పనిచేయలేరు. ఈ భయంతోనే అధికారులు అందరూ వైసీపికి వీర విధేయంగా మెసులుకుంటూ, అయిష్టంగానైనా తప్పులు చేయక తప్పడం లేదు.

దీని వలన వైసీపి లబ్ధి పొందుతుంటే, వారి ఒత్తిళ్ళకు, బెదిరింపులకు, ప్రలోభాలకు తలొగ్గి తప్పులు చేస్తునందుకు కోర్టులలో మొట్టికాయలు వేయించుకోవలసి వస్తోంది.

Also Read – నిర్మలమ్మ హల్వాలో ఏపీకి ఎంతో?

డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్, పలువురు ఎస్పీ, సీఐ, సబ్ ఇన్‌స్పెక్టర్లపై కేంద్ర ఎన్నికల కమీషన్‌ వేటు వేయడం, సిఎస్ జవహార్ రెడ్డి, డిజిపి హరీష్ కుమార్‌ గుప్తాలను కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఢిల్లీకి పిలిపించుకొని అక్షింతలు వేయడం ఇందుకు తాజా ఉదాహరణలు.

అయితే వారి చేత తప్పులు చేయిస్తున్న వైసీపి నేతలను ఏ న్యాయస్థానం లేదా ఈసీ నిలదీసి అడగదు కనుక వారు తప్పించుకుంటే, మద్యలో ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులు బలవుతున్నారు.

ఏబీ వేంకటేశ్వర రావుని జగన్‌ ప్రభుత్వం వేధిస్తున్నప్పుడు కేంద్రం కలుగజేసుకొని ఆయనకు అండగా నిలబడి ఉంటే, ఏపీతో సహా దేశంలో ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులందరికీ ధైర్యం కలిగేది. కానీ ఆవిదంగా చేయకపోవడం వలన ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులు తాము నిస్సహాయులమని, అధికార పార్టీల దయాదాక్షిణ్యాలకు లోబడి పనిచేసుకోకపోతే తమ పరిస్థితి కూడా ఏబీ వేంకటేశ్వర రావులా మారిపోతుందని భయం ఏర్పడటం సహజం.

జగన్‌ ప్రభుత్వం నలుగురు సీనియర్లను కాదని జవహార్ రెడ్డిని సిఎస్‌గా నియమించిన సంగతి తెలిసిందే. బహుశః అందుకే నేటికీ ఆయన జగన్‌కు కృతజ్ఞతగా, అనుకూలంగా మెసులుకుంటున్నట్లు భావించవచ్చు. కానీ రేపు ప్రభుత్వం మారితే ఆయన కూడా పర్యవసానాలు ఎదుర్కోక తప్పదుగా?

ఈవిదంగా అయితే ప్రలోభాలతో లేదా భయపెట్టి, బెదిరించి ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులను రాష్ట్రాలలో అధికార పార్టీలు లొంగదీసుకొంటున్నప్పుడు, కేంద్రం జోక్యం చేసుకొని వారికి అండగా నిలబడుతుంటే, అత్యంత క్లిష్టమైన పరీక్షలు వ్రాసి, అత్యంత కటోరమైన శిక్షణ పొంది, మెరికల్లా బయటకు వచ్చే ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులు రాష్ట్రాలకు, దేశానికి ఎంతో మేలు చేయగలుగుతారు. ఎంతగానో ఉపయోగపడతారు కదా?