‘దేనికైనా రెడీ’ సినిమాకు సీక్వెల్ మాదిరి రూపుదిద్దుకున్న “ఆచారి అమెరికా యాత్ర” ఈ నెల 26వ తేదీన విడుదల కాబోతోంది. సంక్రాంతి సినిమాలు ధియేటర్లలో అణుబాంబులులా మారడంతో, ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి నెక్స్ట్ రిలీజెస్ మీద పడింది. అందులో భాగంగా విడుదలకు సిద్ధమవుతున్న “ఆచారి అమెరికా యాత్ర” ప్రమోషన్స్ లో ముందుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు పాజిటివ్ స్పందన రాగా, తాజాగా మరో 1 నిముషం నిడివి గల ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు.
‘స్వామి రారా’ అంటూ సాగే ఈ పాట వినడానికే కాక, చిత్రీకరణ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా లంగా, వోణీ కాస్ట్యూమ్స్ లో హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ చూడముచ్చటగా ఉంది. అయితే ‘దేనికైనా రెడీ’ సినిమాలో కూడా ఇదే తరహా రొమాంటిక్ సన్నివేశాలు ఉండగా, ఈ “ఆచారి అమెరికా యాత్ర”లో కూడా వాటినే హీరోయిన్ మార్పుతో రిపీట్ చేసినట్లుగా ఈ పాట స్పష్టం చేస్తోంది. ఏది ఏమైనా ప్రమోషన్ వారీగా చూస్తే… కంటెంట్ కు తగిన విధంగా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఆచారి ముందు వరుసలోనే ఉన్నాడు.\



