వైసీపీ ఓటమికి ఎవరు బాధ్యత వహించాలి? జగన్‌? చంద్రబాబు?

AP Local Polls: Jagan Mohan Reddy's Strategy Faces TDP Alliance Test

ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కూటమి సంయుక్త సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ, “ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లా, స్థానిక నేతలే అభ్యర్ధులను ఎంచుకొని తెలియజేసేవారు. కనుక స్థానిక ఎన్నికల్లో నా ప్రమేయం పెద్దగా ఉండేది కాదు. కానీ తొలిసారిగా జోక్యం చేసుకొని అన్నీ చూడాల్సి వచ్చింది,” అని అన్నారు.

ఈ ఎన్నికల్లో కూటమిలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలి కనుక ఆయన జోక్యం అనివార్యమే. అయితే అసలు కారణం అది కాదు.

ADVERTISEMENT

ఈ ఎన్నికలలో జనసేన నుంచి సీట్ల కోసం చాలా ఒత్తిడి వచ్చింది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీకి ఇదొక గొప్ప అవకాశం. కనుక మరిన్ని సీట్ల కోసం జనసేన శ్రేణులు పట్టుబట్టడం సహేతుకమే.

కనుక వారికి బలమున్న చోట్ల సీట్లు తీసుకుని గెలుచుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. కానీ తమకు బలం లేని చోట, టీడీపీ, బిజేపి బలంగా ఉన్న చోట జనసేన పట్టుబట్టి సీట్లు తీసుకుని పోటీ చేసి ఓడిపోతే, అవన్నీ వైసీపీ దక్కించుకుంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ రెబెల్స్ విషయంలో అంత కఠినంగా మాట్లాడారని భావించవచ్చు.

కానీ వైసీపీకి ఏ పార్టీతో పొత్తులు లేవు. కనుక సీట్ల సర్దుబాట్ల సమస్య కూడా లేదు. కనుక ఈ ఎన్నికల బాధ్యతను పార్టీలో సీనియర్లకు, జిల్లా, మండల స్థాయి నేతలకు అప్పగించి, తాను పర్యవేక్షిస్తే సరిపోయేది. కానీ అతిగా జోక్యం చేసుకొని, సాధారణంగా జరగాల్సిన ఈ ఎన్నికలను తన వ్యూహాలతో సంక్లిష్టంగా, ఉద్రిక్తంగా మార్చేశారు.

‘చొక్కా మడత పెట్టి పోలింగ్ బూత్‌కి వస్తా.. ఓటు వేస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ’ రెచ్చగొట్టేలా మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో ఆయన ఆశించిన ఘటనలన్నీ జరిగాయి. కానీ ఆయన ఆశించినట్లు ఫలితాలు వచ్చే సూచనలు కనబడటం లేదు.

ముఖ్యంగా తన కంచుకోట కడప జిల్లాలో ఇప్పటికే ఓటమి చవి చూశారు. రేపు (నవంబర్‌ 1) జరుగబోయే కడప మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో కూడా ఓడిపోతే వైసీపీ ఓటమి పరిపూర్ణం అవుతుంది.

2024 ఎన్నికలలో ఈవీఎంల వలన ఓడిపోయామని, కనుక బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి వాదించేవారు. ఇప్పుడు ఆయన కోరుకున్నట్లే ఈ ఎన్నికలు ‘బ్యాలెట్ పేపర్’తో జరుగుతున్నాయి.

కనుక విజయం సాధించి ప్రజలు తన వైపే ఉన్నారని నిరూపించుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ముందుండి వైసీపీని నడిపించారు కనుక ఒకవేళ ఈ ఎన్నికలలో వైసీపీ గెలిస్తే దాని క్రెడిట్ మొత్తం ఆయనే తీసుకునేవారు. కనుక వైసీపీ ఓడిపోతే దానికీ ఆయనే పూర్తి బాధ్యత వహించాలి కదా? కానీ సీఎం చంద్రబాబు నాయుడును నిందిస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారు.

నిజానికి ఈ అవమానకర పరిస్థితి ఆయన చేజేతులా సృష్టించుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడో మరొకరో కానే కాదు. కనుక నవంబర్‌ 3న ఫలితాలు వచ్చిన తర్వాత ఒకవేళ వైసీపీ ఓడిపోతే, “పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత నేనే వహిస్తానని జగన్‌ చెప్పుకుంటే హుందాగా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడుని నిందించి తప్పుకోవాలని చూస్తే ఆయన నాయకత్వ లక్షణాలను అందరూ ప్రశ్నిస్తారు.

ADVERTISEMENT
Latest Stories