ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సాయిపల్లవి తన నటనతో, హావభావాలతో రెండు తెలుగు రాష్ట్రాలను ఫిదా చేసారు. తన మొదటి సినిమాతోనే అటు నటనలోనూ, ఇటు డాన్స్ లోను తన టాలెంట్ ను నిరూపించుకుని హైబ్రిడ్ పిల్లగా సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ గ్లామర్ పాత్రలకు నో చెప్పి, కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకు మాత్రమే సైన్ చేస్తూ తన దారే వేరప్పా అని చెప్పకనే చెప్పారు. అయితే మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ కు తగ్గ అవకాశలు కానీ అవకాశాలకు తగ్గ విజయాలను కానీ ఈ అమ్మడి ఖాతలో లేనప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సృష్టించుకున్నారు సాయిపల్లవి.
ఒక్కో సినిమాలో ఒక్కో వైవిధ్యమున్న పాత్రలను పోషిస్తూ జయాపజలతో సంబంధం లేకుండా స్టార్ హీరోహిన్ స్థాయిని అందిపుచ్చుకున్నారు. అటు యూత్ ఫాలోయింగ్ తో పాటు ఇటు ఫామిలీ ఇమేజ్ కూడా దండిగా దక్కించుకుంది ఈ హైబ్రిడ్ పిల్ల. ఈ అమ్మడి క్రేజ్ కి ఫిదా అయిన లెక్కల మాస్టర్ సుకుమార్ సాయిపల్లవిని ‘లేడీ పవర్ స్టార్’ అంటూ కొనియాడారు.
ఢీ షో లో డాన్సర్ గా మొదలైన తన బుల్లితెర ప్రస్థానం ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వ్యాపించింది. చేసిన మొదటి సినిమాలోనే తెలంగాణ యాసతో సొంతగా డబ్బింగ్ చెప్పుకుని తెలుగు ప్రజల హృదయాలు కొల్లగొట్టారు సాయిపల్లవి. తెలుగులో హైబ్రిడ్ పిల్లగా మెప్పిస్తే తమిళంలో రౌడీ బేబీ గా రాణించారు.
ఫిదా, లవ్ స్టోరీ, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, పడిపడి లేచే మనసు, విరాటపర్వం, కణం ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో వైవిధ్యమైన పాత్రను ప్రదర్శిస్తూ ఆచి తూచి అడుగులు వేస్తుంది రౌడీ బేబీ. విరాటపర్వం మూవీలో జీరో మేకప్ తో నటించి మేకప్ కి ప్యాకప్ చెప్పిన ఈ తరం హీరోహిన్ గా గుర్తింపు పొందారు. ఆదాయం, అవకాశం రెండు ఉన్నప్పటికీ వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటూ తన ప్రత్యేకతను నిలుపుకున్నారు.
మెగాస్టార్ చిరు, క్రెజీ దర్శకుడు సుక్కు సైతం సాయిపల్లవి నటనకు, డాన్స్ కు ఫిదా అయినప్పటికీ పెద్ద సినిమాలలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. గ్లామర్ షో కి తానూ పెట్టుకున్న హద్దులు కానీ, సినిమాలో నటించే బోల్డ్ సీన్ల తానూ విధించే అభ్యంతరాలు కానీ ఈ అమ్మడికి ఆ అవకాశాలను దూరం చేసి ఉండవచ్చు.
అవకాశాల మాట అటుంచితే ఒక యాక్టర్ గా, డాక్టర్ గా, డాన్సర్ గా మల్టీ టాలెంటెడ్ లేడీ గా ఉన్నప్పటికీ సాయిపల్లవి చూపించే సింప్లిసిటీ, హంబుల్ నెస్ ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ప్రేక్షకుల ఆదరణతో పాటుగా ఇటు అవార్డుల విషయంలో కూడా సాయిపల్లవి ఈ తరం నటీమణులతో పోలిస్తే ఒక అడుగు ముందే ఉంటూ తన మార్క్ చూపించారు.
తాజాగా తండేల్ మూవీతో మరోసారి నాగ చైతన్యతో జత కడుతున్నారు. అలాగే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న రౌడీ బేబీ బాలీవుడ్ క్రెజీ ప్రాజెక్ట్ అయిన రామాయణం మూవీలో సీత పాత్రలో రణబీర్ కపూర్ సరసన స్క్రీన్ షేర్ చెయ్యబోతున్నారు.
బి. టౌన్ లో కూడా ఈ అమ్మడు స్కిన్ షో కి దూరంగా గ్లామర్ పాత్రలకు నో చెప్పి నటనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి అక్కడి ప్రేక్షకులను కూడా తన నటనతో ఫిదా చేసి అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్, కోలీవుడ్ నో గ్లామర్ షో ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అనే ఇమేజ్ నిలుపుకుంటారా?




