ఒకప్పటి జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఎన్నికల ఓటమి తరువాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల సమయంలో శ్రీధర్ పోటీ చెయ్యాలని భావించినా పవన్ కళ్యాణ్ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన నిరాశ చెందారు. దీనితో ఎన్నికల ముందు తిట్టి పోసిన వైఎస్సార్ కాంగ్రెస్ లోనే ఆయన చేరిపోయారు.
తాజా ఇంటర్వ్యూలో తాను పార్టీని వీడటానికి కారణం శ్రీధర్ వివరించారు. “మేమంతా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడుని, లోకేష్ ని ముఖ్యమంత్రి గా చూడాలని, జగన్ ముఖ్యమంత్రిగా కాకూడదని మాత్రమే పని చేశారు.
అందుకే నేను బయటకు వచ్చా,” అని శ్రీధర్ చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలలోకి వచ్చిన శ్రీధర్ ఆ తరువాత బీజేపీలో చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా శ్రీధర్ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఆ పార్టీ అధికార ప్రతినిధి నియమిస్తారని ఆయన అనుకున్నారు.
అయితే ఇప్పటివరకూ అటువంటి నియామకం జరగలేదు. దీనితో శ్రీధర్ ఒకింత నిరాశగా ఉన్నా అధికార పక్షం కావడంతో ముందు ముందు అన్నా ఏమన్నా అవకాశాలు వస్తాయేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనితో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడిగానే కొనసాగుతున్నారు.





