మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అభిమానులు హంగామా చేయడం మాములే కానీ గత కొంత కాలంగా ట్రైలర్ లాంచులను సైతం పెద్ద సంబరంలా థియేటర్లలో చేయడం ఈ మధ్య బాగా పెరిగింది. ఇప్పుడు ఆది పురుష్ దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. ఒక రోజు ముందుగానే హైదరాబాద్ లో వందలాది అభిమాన సందోహం మధ్య అత్యధిక డిమాండ్ ఉన్న ఏఎంబి మల్టీప్లెక్స్ లో విడుదల చేయించింది. రెండు మూడు గంటల ముందుగానే జనం ఆ కాంప్లెక్స్ దగ్గరున్న రోడ్లకు ఇరువైపులా నిలబడి ఎదురు చూశారు.
గత ఏడాది టీజర్ విషయంలో వచ్చిన నెగటివిటీని పోగొట్టడానికి ఆది పురుష్ పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తోంది. ప్రత్యేకంగా త్రీడిలో ట్రైలర్ ని ప్రదర్శించడం కొత్త కాదు కానీ ప్రభాస్ ఫాలోయింగ్ ని వాడుకుని అందరూ దీని గురించే మాట్లాడుకునేలా చేయడం ప్రత్యేక ఎత్తుగడ. ఫిబ్రవరి నుంచి టి సిరీస్ అధినేతలు, దర్శకుడు ఓం రౌత్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తూ వాళ్ళ మద్దతు కూడగట్టుకుంటున్నారు. అయోధ్య సెంటిమెంట్ దేశంలో బలీయంగా ఉన్న టైంలో ఈ కలయికల వల్ల ప్రయోజనం పెద్దగా ఉంటుంది.
రిలీజ్ టైం నాటికి ప్రమోషన్ చేసే విషయంలో బీజీపీ నుంచి స్వచ్చందంగా మద్దతు దక్కుతుంది. బెంగళూరు ఎన్నికల ప్రచారంలో స్వయానా ప్రధాన మంత్రే కేరళ స్టోరీ చూడమని పిలుపునిచ్చినంత పని చేశారు. అలాంటిది రాముడి గాథతో రూపొందిన ఆది పురుష్ కి ఆ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక పన్ను రాయితీలు దక్కినా ఆశ్చర్యం లేదు. గంపగుత్తగా షోలు కొనేసి అనుచరులకు కార్యకర్తలకు భక్తులకు స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ట్వీట్ల పరంపర ఎలా ఉంటుందో వేరే చెప్పాలా.
వందల కోట్ల టార్గెట్ తో బరిలో దిగుతున్న ఆది పురుష్ పెట్టుబడిని వెనక్కు రాబట్టుకోవడానికి ఇదంతా అవసరమే. కేవలం మార్కెటింగ్ చేస్తే సరిపోదు. జూన్ లో రావాలనుకున్న షారుఖ్ ఖాన్ జవాన్ కేవలం ఆది పురుష్ కి ఓపెన్ స్పేస్ ఇవ్వడం కోసమే వాయిదా వేసుకుందన్న గుసగుస ముంబై మీడియాలో ఉంది. దేశవ్యాప్తంగా అతి పెద్ద విడుదల ఆది పురుష్ కే దక్కేలా టి సిరీస్ చేసుకున్న ఈ స్ట్రాటజీ సినిమా ఏ మాత్రం బాగున్నా అద్భుత ఫలితాలను ఇస్తుంది. ప్రభాస్ మీదేం లేదు కానీ ఒత్తిడంతా దర్శక నిర్మాతల మీదే ఉంది.



