సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన వైనం తెలిసిందే. నాటకీయ పరిణామాల తర్వాత జగన్ అధికారం చేపట్టినప్పటికీ, నేటికీ ఆ కేసు ఓ కొలిక్కి రాకపోవడం విశేషం. ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి హాజరు కావడం లేదంటూ కోర్టు పలుమార్లు నోటీసులు కూడా అందజేసినప్పటికీ, జగన్ మాత్రం హాజరు కాలేదు.
ఇదిలా ఉంటే మళ్ళీ సరిగ్గా అదే తరహాలో మరో నెల రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉందనగా, విజయవాడ వేదికగా జగన్ పై రాయి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అజిత్ సింగ్ నగర్ లో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న జగన్ పైకి రాయి దూసుకురావడంతో ఎడమ కంటి ఆవరణలో గాయమైంది. అయితే ఈ దాడి ఎవరు చేసారన్నది ప్రాధమికంగా తెలియరాలేదు.
ఇందులో గమనించదగిన అంశం ఏమిటంటే… జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలోనే పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే మరోసారి విద్యుత్ అంతరాయం కలిగిన సమయంలో ఈ రాయి దాడి జరిగినట్లుగా సమాచారం.
జగన్ పై ఆగంతకులు దాడి చేసారని సాక్షి మీడియా ఈ ఘటనపై ప్రసారం చేస్తోంది. అనంతపురం జిల్లాలో ఇదే బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో చెప్పు విసిరిన వీడియోలు ప్రత్యక్షమైన వైనం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. కానీ ప్రస్తుత రాయి దాడిలో జగన్ భౌతికంగా గాయమయ్యారు.
ఈ ఘటన ఎవరు చేసినా ఖండించాలి. జగన్ పాలనపై నిరసన తెలియజేయాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక రకమైన విధానాలు ఉన్నాయి. ఇలా భౌతిక దాడులకు దిగడం ఏ మాత్రం సమంజసం కాదు. అయితే ఈ ఘటన జగన్ కు అనుకూలం అవుతుందో, ప్రతికూలంగా మారుతుందో వేచిచూడాలి.
ఎందుకంటే జగన్ ఖాతాలో ఇప్పటికే తేలని కోడి కత్తి కేసు ఉంది. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన ఈ కేసు ఇప్పటికీ తేలకపోవడంతో, ఇదో పెద్ద ‘పొలిటికల్ స్టంట్’గా ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాయి. ‘జగన్ అండ్ కో’ కూడా ఈ కేసుపై మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిచ్చినట్లయ్యింది.
మరి ఈ రాయి దాడిని వైసీపీ వర్గాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తారో అనేది అత్యంత ఆసక్తిగా మారింది. గతంలో మాదిరి సింపతీనే ప్రధాన అజెండాగా తీర్చిదిద్దుతారో లేక నిజంగా దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారో నిరీక్షించాలి. ఎంత కాదనుకున్నా, రాజకీయ నాయకులపై జరిగే ఇలాంటి దాడులు ప్రధానంగా ఎన్నికలు లేక పోలింగ్ కు ముందే జరుగుతుండడం కాకతాళీయమేనా!?
“ఏమో ఆ “జగన్నాటక సూత్రధారి”కే ఎరుక! గతంలో ఇలాగే ఎన్నికల ముందు మమతా బెనర్జీ వంటి వారిపై కూడా దాడులు జరగడం, తద్వారా రాజకీయ ప్రయోజనం చేకూరడం తెలియనిది కాదు” అని టీడీపీ వారు అంటున్నారు.




