అగ్ర హీరోల సినిమాలను – వివాదాలకు ఎంత అవినాభావ సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ ఏ చిన్న అంశం దొరుకుతుందా… అని కాచుకునే కూర్చునే వివాదాపరులకు కొదవలేదు. మరి ఎలాంటి వివాదం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” సినిమా విడుదలైపోతోంది అనుకుంటున్న వారికి చివరి నిముషంలో షాక్ తగిలింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “అజ్ఞాతవాసి”లో వివాదం చెలరేగడానికి అవకాశం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఉందిలేండి!
దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలపించిన గేయమే ఈ కేసుకు కారణమైంది. ‘కొడకా కోటేశ్వరరావు ఖర్సైపోతవురో… నువ్వు పులుసైపోతవురో…’ అంటూ పవన్ పాడిన పాటే వివాదానికి కేంద్రంగా మారింది. ఈ ఆల్బమ్ హైలైట్ సాంగ్ గా నిలిచిన ఈ పాటలోని కోటేశ్వరరావు అనే పేరు అసలు మ్యాటర్ అయ్యింది. ఈ పేరుతో ఉన్న న్యాయవాది తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అంతేకాదు, కోటేశ్వరరావు పేరు గల వారందరూ కూడా బాధపడతారని పేర్కొన్నారు.
తమ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే… ఆ పాటలోని కోటేశ్వరరావు అన్న పేరును తొలగిస్తే సరిపోతుందని, వెంటనే ‘కోటేశ్వరరావు’ పేరును తొలగించాలని డిమాండ్ చేసారు. దీంతో “అజ్ఞాతవాసి”పై తొలి కేసు నమోదైంది. ఇప్పటికే ఓ ఫ్రెంచ్ సినిమా రీమేక్ అంటూ ప్రముఖ టీ సిరీస్ సంస్థ వివాదం ఒక పక్కన ఉండగా, విడుదలకు కొద్ది గంటల ముందు ఈ ‘కోటేశ్వరరావు’ వివాదం తెరపైకి వచ్చింది. కలెక్షన్స్ సునామీ ఉండాలంటే… ఈ మాత్రం వివాదాలు ఉండాలిలేండి!



