ఏఐ పుణ్యమాని అనేక లక్షల మందికి కొత్త కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తే అదే ఏఐ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు కూడా. కనుక ఏఐ వలన అంతిమంగా ఈ ప్రపంచానికి మంచే జరుగుతుందో కీడే జరుగుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది.
పరిశ్రమలలో రోబోటిక్ యంత్రాలు ఎప్పుడో వచ్చేశాయి. అవి 10 మంది మనుషులు చేసే పనిని ఒక్కటే అవలీలగా చేసేస్తున్నాయి. వాటి ప్రవేశంతో వాహనాలు తదితర తయారీ రంగాలలో ఉత్పత్తి, నాణ్యత గణనీయంగా పెరిగింది. కానీ వాటి కారణంగానే అనేక మంది ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు.
షాపింగ్ మాల్స్ వచ్చి ఊర్లలో కిరాణా, బట్టలు, చెప్పులు తదితర దుకాణాలను మింగేస్తే, వాటిని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్‌లైన్ సంస్థలు మింగేస్తున్నాయి.
ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి సంస్థల పుణ్యమాని ఇప్పుడు ప్రజలు చాలా సుఖపడుతున్నారు. అలాగే వాటితో కేవలం పదో తరగతి అంత కంటే తక్కువ చదువుకున్న లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు కూడా.
అతి త్వరలోనే ఎయిర్ టాక్సీలు, సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు వచ్చేస్తున్నాయి. కనుక వీటితో ప్రజలు మరింత సులువుగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలుగుతారు. కానీ వీటితో ఆటోలు, టాక్సీలు, క్యాబ్ టాక్సీలు నడుపుకొని జీవిస్తున్నవారు ఆ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
‘హోటల్‌కి వెళ్ళి తినడం దేనికి మీరు కోరుకున్న ఆహరం మీ ఇంటికే తెచ్చిస్తామంటూ…’ స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. వాటితో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లో డ్రోన్ సిటీ రాబోతోంది. అది సిద్దమైతే చీమల పుట్టలో నుంచి చీమలు వచ్చినట్లు కుప్పలు తెప్పలుగా రకరకాల డ్రోన్లు అందుబాటులోకి వచ్చేస్తాయి.
ఇప్పటికే డ్రోన్లని ఎంతగా వాడేసుకోవాలో అంతగానూ వాడేసుకుంటున్నారు. అవి కూడా ఫుడ్, మెడిసన్స్, కూరగాయలు, పప్పులు ఉప్పులూ డెలివరీ చేయడం మొదలుపెడితే స్విగీ, జొమోటోల ద్వారా ఉపాధి పొందుతున్నవారు రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది.
ఇదివరకు బల్బు నుంచి ట్యూబ్ లైట్లకు, తర్వాత ఎల్ఈడీ లైట్లకు, టైప్ రైటర్ల నుంచి కంప్యూటర్లకు మారడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఆ మార్పులతో కూడా కొంత నష్టం జరిగినప్పటికీ, కాలక్రమంలో మెల్లగా జరిగిన ఆ మార్పులకు అందరూ అలవాటుపడి మారిపోగలిగారు.
కానీ ఇప్పుడు రోజుకో కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త పరికరాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. మానవుల సుఖ జీవనం కొరకు మానవులు సృష్టిస్తున్న ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమే మానవులకు సవాలుగా మారుతోంది. ఈ అత్యాధునిక సవాళ్ళ నేపధ్యంలో మనుషుల జీవనం ఇంకా కష్టంగా మారుతోంది. కనుక భవిష్యత్ తరాలు రాబోయే దశాబ్దాలలో ప్రతీ క్షణం టెక్నాలజీతో పోటీ పడుతూనే జీవించక తప్పదేమో?




