నదిలోకి కొత్త నీరు వస్తుంటే పాతనీరు కొట్టుకుపోవలసిందే! అలాగే సాంకేతికంగా ఓ కొత్త ఆవిష్కరణ జరిగితే అంతకు ముందున్నవి క్రమంగా మాయం అవుతూనే ఉంటాయి. ఒకప్పుడు విరివిగా వాడిన రుబ్బురోళ్ళు మొదలు టైప్ రైటర్స్, లాండ్ లైన్ ఫోన్లు వంటివన్నీ అలా కొత్త ప్రవాహంలో కొట్టుకుపోయినవే. కనుమరుగైనవే.
ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) వచ్చేసింది. కనుక మనుషులు ఆలోచించించి చేయల్సిన పనులను కూడా అదే చక్కబెట్టేస్తోంది. ఇప్పుడు ఏఐ ప్రవేశించని రంగం అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు.
అనేక వందల మంది గంటలు, రోజుల తరబడి చేసే పనులను ఏఐ చిటికలో చేసేస్తోంది. కనుక ఏఐతో ఉద్యోగాలకు ఎసరు వస్తుందని అందరూ ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ హెచ్ఆర్ విభాగంలో 15 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. వారు చేసే పనులను పైసా ఖర్చు లేకుండా ఏఐ చేత చేయించాలనుకుంది. తద్వారా ఆ మేరకు భారీగా ఖర్చు తగ్గించుకోగలమని భావిస్తోంది. అమెజాన్ ఒక్కటే కాదు… ఇప్పుడు అన్ని ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలలో ఇదే జరుగుతోంది.
టైప్ రైటర్లకు బదులు కంప్యూటర్లు వస్తే వాటిపై మనుషులు పట్టు సాధించి జీవితాలలో రాణించారు. ఇప్పుడు ఏఐపై కూడా మనుషులు పట్టు సాధించగలరు. ఇప్పటికే ఏపీతో సహా యావత్ దేశంలో, యావత్ ప్రపంచంలో ఏఐ కోర్సులు మొదలైపోయాయి కూడా. కానీ ఏఐపై ఎంత పట్టు సాధించినా అదే మనుషులను రీప్లేస్ చేసేస్తుంటే ఏం చేయాలి?
ఏఐతో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయేవారి పరిస్థితి…. వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? అని ఈ రంగంలో ఉన్నవారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి ప్రత్యామ్నాయాలు చూపాలి. ఇప్పటికే భారత్‌లో తీవ్ర నిరుద్యోగ సమస్య ఉంది. చైనా మాల్ పుణ్యమాని అనేక కంపెనీలు మూతపడుతుండటంతో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలు ఎన్నో ప్రభుత్వం వద్ద లెక్కలు లేవు.
ఇప్పుడు ఏఐ వలన ఉద్యోగాలు కోల్పోయినవారు కూడా తోడైతే సమాజంలో అశాంతి, సాంఘిక, సామాజిక సమస్యలు పెరిగిపోతాయి. ఇప్పటికే ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సైబర్ నేరాలు జరుగుతున్నాయి. వాటి సంఖ్య, తీవ్రత నానాటికి పెరుగుతూనే ఉన్నాయి.
కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐ గురించి గొప్పగా వర్ణిస్తుండటం గమనిస్తే అవి ఈ సమస్య తీవ్రతని ఇంకా గుర్తించలేదని అర్ధమవుతోంది. కనుక ప్రత్యామ్నాయాల గురించి కూడా ఇంకా ఆలోచిస్తున్నట్లు లేవు.
భారతదేశ జనాభా ఇప్పుడు 150 కోట్లు పైమాటే. ఇన్ని వందల కోట్ల మందికి ప్రతీ రోజూ తిండి, బట్ట, విద్య, వైద్యం వంటి కనీస వసతులు తప్పనిసరి. కనుక ఉత్పత్తి తదితర రంగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నట్లయితే ఏఐ వలన పెరిగే నిరుద్యోగ సమస్యలను కొంత వరకు అరికట్టవచ్చు.







