ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఇండస్ట్రీ హిట్లు, డిజాస్టర్లు సహజం. కెరీర్ మొదటి నుంచి చివరి దాకా కేవలం సక్సెస్ లతోనే నిలబడిన వాళ్ళు ప్రపంచ చరిత్రలోనే లేరు. జయాపజయాలు ప్రతిసారి మన చేతుల్లో ఉండవని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. అఖిల్ ఏజెంట్ ఎప్పుడో ఏప్రిల్ చివరి వారంలో రిలీజయ్యింది. అత్యంత ఘోరంగా ఫ్లాపై అఖిల్ ఆశలపై నీళ్లు జల్లింది.
సరే జరగకూడనిది ఏమీ జరగలేదు. పోయిన దాన్ని మళ్ళీ నిలబెట్టలేం. ఓటిటిలో ఎప్పుడో రావాల్సింది. కానీ ఇప్పటిదాకా అతీగతీ లేదు. హక్కులు కొన్న సోనీ లివ్ మేలోనే ప్రకటన ఇచ్చింది కానీ ఆ తర్వాత అంతా గప్ చుప్. డిజిటల్ వెర్షన్ కోసం కొత్తగా ఎడిటింగ్ చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. నిర్మాత అనిల్ సుంకర అదేమీ లేదని ఆ మధ్య జరిగిన సామజవరగమన ప్రెస్ మీట్లో చెప్పేశారు.
మరి ఏజెంట్ ఎందుకు స్ట్రీమింగ్ కు రావడం లేదనేది అంతు చిక్కని ప్రశ్న. పోనీ ట్రోలింగ్ చేస్తారని అనుకుంటే అది సోనీకి సంబంధం లేని వ్యవహారం. దాని వల్ల అఖిల్, సురేందర్ రెడ్డిలకు సమస్య కాని వేరొకరికి కాదు. అలాంటప్పుడు వదిలేస్తే పోయడానికి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు. ఇదే స్థాయిలో బోల్తా కొట్టిన ఆచార్య, లైగర్ లాంటి వాటిని నిక్షేపంగా ఓటిటికి ఇచ్చారుగా. ఏం మునిగింది.
ఏజెంట్ వల్ల తమ బ్రాండ్ కి డ్యామేజ్ అవుతుందని సోనీ ఆగుతోందా లేక అసలిది బయటికే రాకపోవడం మంచిదని అక్కినేని తరపున ఎవరైనా చక్రం తిప్పారా అనేది భేతాళ ప్రశ్న. సమాధానం ఇప్పట్లో దొరక్కపోవచ్చు. ఒకప్పుడు సినిమాల వల్ల కోట్ల నష్టం వచ్చిందని ఇండస్ట్రీ వదిలేసిన ప్రొడ్యూసర్లు, ఆత్మహత్య చేసుకోబోయిన నిర్మాతలు ఉన్నారు. ఏజెంట్ వల్ల అంత దారుణాలు అయితే జరగలేదు.
అఖిల్ విదేశాలకు వెళ్లొచ్చి కొత్త ప్రాజెక్టు పనుల్లో పడ్డాడు. అనిల్ సుంకర ఒక అదిరిపోయే విజయం అందుకుని మరో రెండు రిలీజ్ కి సిద్ధం చేశారు. సాక్షి వైద్య మెగా ఆఫర్ పట్టేసింది. మమ్ముట్టి అసలిది చేసిన విషయమే మర్చిపోయారు. ఇంతోటి దానికి ఏజెంట్ కి బ్రేక్ వేయడం ఏమిటోనని మూవీ లవర్స్ బుర్ర గోక్కుంటున్నారు. అభిమానులు మాత్రం రాకపోతే మంచిదని ఫీలవ్వడం కొసమెరుపు.



